ఎస్‌ఐహెచ్‌ఎం సిబ్బందికి ఊరట – రూ.84 లక్షల బకాయిల విడుదల

* తిరుపతి ఎస్.ఐ.హెచ్.ఎం సిబ్బంది వేతన కష్టాలకు తెర.. పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ చొరవతో రూ.84 లక్షల బకాయిలు విడుదల

* గత ప్రభుత్వ వైఖరితో 22 నెలలుగా నిలిచిన జీతాల సమస్య పరిష్కారంపై హర్షాతిరేకాలు

* సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీచింగ్ మరియు నాన్-టీచింగ్ సిబ్బంది

* కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సిబ్బంది

అమరావతి, తిరుపతిలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (ఎస్ఐహెచ్ఎం) సిబ్బంది సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న వేతన సమస్యకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ చొరవతో పరిష్కారం లభించింది. గత ప్రభుత్వ వైఖరితో 22 నెలలుగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ. 84 లక్షల వేతన బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయడంతో సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని మంత్రి ఛాంబర్‌లో సిబ్బంది ప్రతినిధులు మంత్రి కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సిబ్బంది ఆవేదన – మంత్రి స్పందన:

గత రెండేళ్లుగా జీతాలు అందక తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, ఈ విషయాన్ని గత నెలలో మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తక్షణమే స్పందించారని సిబ్బంది పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా కృషి చేసినందుకు మంత్రి కందుల దుర్గేష్ కి వారు ధన్యవాదాలు తెలిపారు.

మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన వారిలో బోధనా సిబ్బంది తరపున లెక్చరర్ కె. శివరామకృష్ణ, లెక్చరర్ మరియు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎస్. భార్గవి, అలాగే నాన్-టీచింగ్ సిబ్బంది అకౌంట్స్ అసిస్టెంట్ సి. నరేష్, స్టోర్ అసిస్టెంట్ పి. జ్యోత్స్న దేవి తదితరులు ఉన్నారు. తమ కష్టాలను గుర్తించి అండగా నిలిచిన మంత్రి కందుల దుర్గేష్ కి, కూటమి ప్రభుత్వానికి, ప్రత్యేకించి సీఎం చంద్రబాబునాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు అజయ్ జైన్, ఆమ్రపాలి కాట లకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వారు ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.