
* పెరిగిన సాగు, దిగుబడులు
* దిగుమతి సుంకాల కుదింపుతో కుదేలు
* మార్క్ ఫెడ్ మాయాజాలం
కనీస మద్దతు ధర దక్కక శనగ రైతులు కుదేలవుతున్నారు. ఏపీలో ఇటీవల కాలంలో శనగ సాగు అనూహ్యంగా పెరిగింది. దీనికితోడు ప్రస్తుత రబీ సీజన్‌లో శనగ పంటలో మంచి దిగుబడులు వచ్చాయి. అయితే శనగల దిగుమతులు భారీగా పెరగడం రైతుల పాలిట శాపంగా మారింది. ప్రస్తుత పంటతో పాటు మూడేళ్ల నుంచి శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన శనగలకు సరైన ధర దక్కడం లేదు. తాజాగా పెద్ద ఎత్తున పంట వచ్చిన నేపథ్యంలో ధరలు పతనం అయ్యాయి. కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించినా అరకొర కొనుగోళ్లు ధరల పతనాన్ని అడ్డుకోలేకపోతున్నాయి.
*ధర దయనీయం
శనగ రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. రబీలో పండించే శనగలను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరకొర ఏర్పాట్లు చేయడంతో రైతులు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా రబీలో 8.5 లక్షల ఎకరాల్లో శనగ సాగు కావాల్సి వుండగా ఈ ఏడాది అది 10 లక్షల ఎకరాలకు పెరిగింది. దేశీయంగా ఈ ఏడాది శనగలో మంచి దిగుబడులు వచ్చాయి. వాతావరణం అనుకూలించడంతో ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మొత్తం మీద ఏపీలోనే 8 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. అయితే ఇక్కడ కేంద్రం కేవలం 94500 టన్నులు మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్‌కు అనుమతి ఇచ్చింది.
*దిగుమతి సుంకాల తగ్గింపుతో మరింత సంక్షోభం
శనగల ఎగుమతులను ప్రోత్సహించాల్సిన కేంద్రం, దిగుమతులకు గేట్లు ఎత్తేసింది. గతంలో దిగుమతులపై 40 నుంచి 60 శాతం సుంకాలు వుండగా, 2024లో పూర్తిగా ఎత్తివేసింది. తరవాత రైతులు గగ్గోలు పెట్టడంతో దిగుమతి సుంకాలను నామమాత్రంగా 10 శాతం విధించింది. సుంకాలు దారుణంగా తగ్గించడంతో సమస్య జఠిలం అయింది. శనగ పండించిన రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదు. నిల్వ చేయాలన్నా కొన్ని ప్రాంతాల్లో శీతల గిడ్డంగులు ఖాళీ లేవు. ఇప్పటికీ సరైన ధర లేక కొన్ని శీతల గిడ్డంగుల్లో శనగల నిల్వలు పేరుకుపోయాయి.
*అరకొర కొనుగోళ్లు
కేంద్రం అనుమతితో రంగంలోకి దిగిన మార్క్‌ఫెడ్ అరకొరగా శనగల కొనుగోళ్లు చేస్తోంది. కేంద్రం అనుమతించిన లక్ష్యం మేరకు కొనుగోళ్లు చేస్తోంది. వాస్తవంగా రైతుల వద్ద వున్న పంటలో సగం కూడా మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులకు మద్దతు ధర కలగా మిగిలింది. పలు జిల్లాల్లో ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్ 50 వేల టన్నుల శనగలు మాత్రమే కొనుగోలు చేసింది. కేంద్రం మొత్తం కేవలం 94500 టన్నులు కొనుగోలు చేసేందుకు మాత్రమే అనుమతించింది.
*మద్దతు ధర అందనంత దూరం
ఈ ఆర్థిక సంవత్సరంలో శనగల కనీస మద్దతు ధరను రూ.5875గా నిర్ణయించారు. వ్యాపారులు మాత్రం రైతుల వద్ద నుంచి క్వింటా రూ.5 వేల నుంచి రూ.5500లకు అడుగుతున్నారు. చాలా మంది రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారులకు దక్కిన ధరకు అమ్ముకుంటున్నారు. ప్రకాశం, కర్నూలు, కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో తెల్ల, ఎర్ర శనగ సాగు చేశారు. ప్రస్తుతం పంట నూర్పిడిలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నూర్పిడి పూర్తి చేశారు. కొంత సరకు అమ్ముకుని మరికొంత శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకోవాలని రైతులు భావిస్తున్నారు. వ్యాపారులు రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకుని తరువాత అధిక ధరకు అమ్ముకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటికే శీతల గిడ్డంగులు నిండిపోయాయి. శనగలు ఎగుమతి చేయకపోగా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడంతో నిల్వలు పేరుకుపోయాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో శనగ పంట సాగు విస్తారంగా జరుగుతోంది. రబీలో వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో బర్లీ పొగాకు, పత్తి, మిర్చికి ప్రత్యామ్నాయంగా రైతులు శనగ సాగు చేస్తున్నారు. దేశవాళీ పుల్ల శనగలతోపాటు, బెంగాళీగ్రామ్ అంటే తెల్లశనగలు పండిస్తున్నారు. నల్లబర్లీ పొగాకు ధర పడిపోవడంతో రైతులు రబీలో శనగ సాగు చేపట్టారు. ప్రభుత్వం హెచ్ డి బర్లీ పొగాకు సాగుపై నిషేధం విధించడం కూడా శనగ సాగు పెరగడానికి దారితీసింది. కేంద్రం మద్దతు ధర ప్రకటించినా రైతుల నుంచి పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సి వుంది. రెండేళ్ల కిందట దేశీయ రకాల శనగలు క్వింటాకు రూ.10 వేల ధర లభించింది. నేడు క్వింటాకు రూ.5 వేల ధర కూడా దక్కకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శగనల దిగుమతులపై సుంకాలు పెంచి రైతులను కాపాడాలంటూ బీజేపీ ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, కొంత మంది రైతు సంఘాల నేతలు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి శ్రీ పియూష్ గోయల్‌కు వినతి పత్రం అందించారు. దేశ వ్యాప్తంగా ఈ రబీలో శనగ సాగు విస్తీర్ణం 81.67 లక్షల హెక్టార్ల నుంచి 84.91 లక్షల హెక్టార్లకు పెరిగింది. దిగుమతి సుంకాలు 60 శాతం నుంచి పది శాతానికి తగ్గించడంతోపాటు, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్, సోషల్ వెల్ఫేర్ పన్నులు పూర్తిగా తొలగించడంతో దిగుమతులు భారీగా పెరిగాయని ఎంపీ గుర్తుచేశారు. దిగుమతి సుంకాలను సమీక్షించడం ద్వారా శనగ దిగుమతులపై నియంత్రణ విధించాలని ఎంపీ కోరారు. మద్దతు ధర కన్నా అధిక ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలి. మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడాలి. దేశ ఆహార భద్రత, రైతుల సంక్షేమం, ఆత్మనిర్బర భారత్ లక్ష్యాల సాధనలో భాగంగా రైతుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని వినతి పత్రం ద్వారా కోరారు.