60వ సారి రక్తదానం చేసిన భగవాన్
–భగవాన్ సేవలు ఆదర్శనీయం
–ఇసిటీఎస్ మెడికల్ కౌన్సిలర్ జేసు ప్రసాద్
ఆపదలో ఉన్న 60 మంది ప్రాణాలు కాపాడిన భగవాన్ ని యువత ఆదర్శంగా తీసుకుని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఐసిటీఎస్ మెడికల్ కౌన్సిలర్ జె జేసుప్రసాద్ అన్నారు. రాజమండ్రి ప్రవేటు ఆసుపత్రిలో ముత్యాలపల్లి గ్రామానికి చెందిన మహిళకు శస్త్ర చికిత్స నిమిత్తం నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రి రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో భగవాన్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జేసు ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఉండి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని అన్నారు. సరైన సమయంలో రక్తం అందుబాటులో లేకపోవడంతో చాలామంది మృత్యువాత పడే పరిస్థితులు అధికంగా ఉన్నాయన్నారు. అటువంటి పరిస్థితుల్లో భగవాన్ స్పందించి రక్తదానం చేయడం, 60 మంది జీవితాల్లో వెలుగులు నింపడం గొప్ప విషయమన్నారు. రక్తదానం చేయడం వల్ల నీరసం వస్తుందని చాలామంది అపోహ పడుతున్నారన్నారు. ఆరోగ్యవంతుడు 3 నెలలకు ఒకసారి హిమోగ్లోబిన్ లెవెల్స్ చూసుకుని ఇవ్వవచ్చునని అన్నారు. స్వచ్చందంగా రక్తదానం చేసేందుకు యువత, పేషేంట్ కుటుంబ సభ్యులు ముందుకు రావాలని జేసుప్రసాద్ సూచించారు. భగవాన్ కి యాంటీ వైరస్ కళ్ళజోడు బహుమతిగా అందించారు. ఆరోగ్య వర్షణీ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి నాగిడి రాంబాబు, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు ప్రతినిధి వికాష్ తదితరులు ఉన్నారు.