నేను ప్రజలకు మాత్రమే దత్తపుత్రుణ

ప్రశ్న: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు నోటీసులు ఇవ్వడం, భారీ నిరసన ప్రదర్శన నిర్వహించడం చూశాం. రాజీ జరిగిన అనంతరం ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో ముఖ్యంగా మిమ్మల్ని ఉద్దేశిస్తూ దత్తపుత్రుడు అనే మాటను ప్రయోగించారు. దీనిపై మీరేమంటారు?

జవాబు: వైసీపీ నాయకత్వానికి నేను ఒక్కటే తెలియజేస్తున్నాను… నేను ప్రజలకు మాత్రమే దత్తపుత్రుడుని. వైసీపీ నాయకులు, సలహాదారులు, గౌరవ పెద్దలు మాట్లాడిన మాటలు, చేసిన కామెంట్లు నా దృష్టికి వచ్చాయి. ఉద్యోగుల సమస్య విపక్షాలు సృష్టించింది కాదు. ఎన్నికల సమయంలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తాం, జీతాలు పెంచుతామని ఉద్యోగులకు ఆశలు కల్పించింది మీరు. వాళ్లకు రావాల్సింది, పే రివిజన్ కమిషన్ సూచించిందే అమలు చేయమని అడుగుతున్నారు. అమలులో చాలా ఆలస్యమైంది. దీని కోసం చాలా సమావేశాలు నిర్వహించారు. మంత్రులు కూర్చున్నా తెగలేదు. ఉద్యోగులకు కోపం వచ్చి లక్షలాదిగా రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వం మీద నిరసన తెలిపితే దానికి జనసేనను, మిగతా పార్టీలను, విపక్షాలను విమర్శించడం సమర్థవంతమైన చర్య కాదు. వైసీపీ నాయకులు, ప్రభుత్వ ధోరణి ఎలా ఉందంటే వాళ్లను ఎవరూ ఏమీ అనకూడదు. వాళ్లు ఏం చేసిన డూడూ బసవన్నలా తల ఊపేసి ముందుకెళ్లిపోవాలి. అలా కాదంటే సుప్రీంకోర్టున్యాయమూర్తుల దగ్గర నుంచి ఈ రోజు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న టీచర్ల వరకు అందరినీ శత్రువులుగానే చూస్తారు. – వెటకారాలు ఆపి పని చూడండి మేము డూడూ బసవన్న పని చేయలేం. న్యాయంగా వాళ్లకు దక్కాల్సిన హక్కు గురించే అడుగుతున్నారు. చేయాల్సింది చేస్తే వాళ్లెందుకు రోడ్లు మీదకు వస్తారు. మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ రెచ్చగొట్టేలా మాట్లాడుతారు. ఈ రోజు టీచర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారంటే అది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. ఇచ్చిన మాట మీద నిలబడకుండా వెటకారాలు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ముందు వెటకారాలు ఆపి పని చూడండి. అదొక్కటే మేము కోరుకునేది. • ఉద్యోగులను రెచ్చగొట్టేలా మాట్లాడారు

ప్రశ్న: ఉద్యోగుల పి.ఆర్.సి. విషయంలో ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో ముందుకు వెళ్లిందన్న మీ వ్యాఖ్యలపై సలహాదారు శ్రీ సజ్జల కామెంట్ చేశారు. మీ స్పందన ఏమిటి?

జవాబు: నా కామెంట్స్ ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల గారికి ఇబ్బంది కలిగించాయని మాట్లాడుతున్నారు. ఆధిపత్య ధోరణి అనే పదాన్ని పదేపదే ప్రస్తావిస్తూ ఇబ్బంది పడుతున్నారు. ఆధిపత్య ధోరణి అంటే హై-హ్యాండెడ్ నెస్ అని నా ఉద్దేశం. ఆధిపత్య ధోరణి అనే పదాన్ని ఎందుకు అన్నానంటే… సమస్య వచ్చి రోడ్ల మీదకు వచ్చిన ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తామని రకరకాల మాధ్యమాల ద్వారా ప్రచారం చేయించడం, మీ మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడం చూసి ప్రభుత్వం హై-హ్యాండెడ్ గా బిహేవ్ చేసింది అన్నాను. మీరు మాట్లాడిన మాటలు సంతృప్తికరంగా లేవని మాట్లాడాను. దానిని వక్రీకరించొద్దని పెద్దలు సజ్జల గారికి నా విన్నపం. ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణం. లక్షలాది మంది రోడ్ల మీదకు వచ్చారంటే విపక్షాలు చెబితే వచ్చింది కాదు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ, కమ్యూనిస్టులు చెబితే వచ్చిన వారు కాదు. మీరొక విధానం ప్రకటించాక.. మీరిచ్చింది వారికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వాళ్ళు రోడ్లు మీదకు వచ్చారు. బాధ్యతగల రాజకీయ పార్టీగా వారికి మద్దతుగా మాట్లాడటం మా బాధ్యత. మేమెందుకు ఉద్యోగులను రెచ్చగొడతాం. ఒక విధానం ప్రకటించి, జీతాలు పెంచుతామని ఆశలు చూపించి, ఈ రోజు పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదని లక్షలాది మంది రోడ్ల మీదకు వస్తే వాళ్లకు మద్దతుగా మాట్లాడవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం విఫలమవ్వాలని ఏ ఒక్కరు కోరుకోరు. మరింత సమర ్ధ వంతంగా పనిచేయాలనే అందరం కోరుకుంటాం. మీరు ఆధిపత్య ధోరణి ఆధిపత్య ధోరణి అని మాట్లాడాం అంటున్నారు… లక్షలాది మంది ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపిన తరువాత మీ అగ్రనాయకత్వం వచ్చి ఎంతో ప్రేమగా పలకరించి హత్తుకున్నారు. అదేదో ముందే చేస్తే ఈ గొడవ ఉండేదే కాదు కదా. అలా చేసి ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం వచ్చేదే కాదు కదా. అది దృష్టిలో పెట్టుకోండి దయచేసి నా మాటలను తప్పుదోవ పట్టించొద్దని సజ్జల గారికి నా విన్నపం. • తెలంగాణ యాత్రలో భాగంగా పార్టీ నేతలు, శ్రేణులతో సమావేశాలు


ప్రశ్న: తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, శ్రేయస్సు కాంక్షిస్తూ యాత్ర చేయాలని అనుకుంటున్నారని తెలిసింది. ఆ యాత్ర వివరాలు ఏమిటి? ఎలా ఉండబోతుంది?


జవాబు: దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అభివృద్ధి, వారి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ‘అనుష్టుప్ నారసింహ దర్శన యాత్ర’ సంకల్పించాను. మా ఇంటి ఇలవేల్పు, ఆరాధ్యదైవం, నన్ను విద్యుత్ ప్రమాదం నుంచి కాపాడి, నాకు పునర్జన్మనిచ్చిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని ముందుగా దర్శించుకొని, అనంతరం ధర్మపురి నారసింహుని క్షేత్రం, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాంపల్లి గుట్ట నారసింహుని క్షేత్రాన్ని దర్శించుకుంటాను. మిగతా 30 నారసింహ క్షేత్రాలను దశలవారీగా దర్శించి ప్రజలను చల్లగా చూడాలని స్వామి దీవెనలు కోరుకోవడానికి ఈ యాత్ర సంకల్పించాను. తెలంగాణలోని క్షేత్రాల పర్యటనలో భాగంగా అక్కడి నాయకులు, జన సైనికులతో కూడా పరిమితమైన సమావేశాలు జరపాలని నిర్ణయించాం. అలాగే మార్చి 14న ఆవిర్భావ దినోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.