విద్యుత్ బస్సులను ఆర్టీసీయే కొనుగోలు చేసి నడపాలి: జేఏసీ డిమాండ్

విద్యుత్ బస్సులను ఆర్టీసీ స్వయంగా కొనుగోలు చేసి, సంస్థ ఆధ్వర్యంలోనే ప్రజలకు సేవలందించాలని జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సోమవారం మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద ఉద్యోగ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు జనార్ధన్ మాట్లాడుతూ, ఆర్టీసీ సేవలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగితే ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడటంతో పాటు ఉద్యోగుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజలకు చవకైన, సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించాలంటే ఆర్టీసీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ బస్సుల నిర్వహణను పూర్తిగా ఆర్టీసీకి అప్పగించడం ద్వారా సంస్థ ఆర్థికంగా కూడా బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.

నేషనల్ యూనియన్ మద్దూర్ రీజనల్ అసిస్టెంట్ మల్లికార్జునరావు మాట్లాడుతూ, ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలకు ప్రయోజనం చేకూరుతున్నప్పటికీ, ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సంస్థ ప్రతిష్ఠను నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఉద్యోగుల సంక్షేమం, సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలిచి పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

ఈ ధర్నా కార్యక్రమంలో జేఏసీ నాయకులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సభ్యులు, ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లకు మద్దతు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.