ఫార్మాసిటీ అగ్నిప్రమాదం: విశాఖ పరిశ్రమలపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

విశాఖపట్నం సమీపంలోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

పరవాడ మండలంలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న ‘దక్షినా ఎనర్జీ’ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించడంతో ఇద్దరు కార్మికులు లోపలే చిక్కుకుని సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విశాఖ పారిశ్రామిక ప్రాంతంలోని అన్ని పరిశ్రమల్లో తక్షణమే భద్రతా తనిఖీలు (సేఫ్టీ ఆడిట్లు) నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని, కార్మికుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.