మాది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం

* ప్రజా సమస్యల పరిష్కరానికి నిబద్ధతతో పని చేస్తాం… అభివృద్ధి చేసి చూపిస్తాం
* గత ప్రభుత్వం నిధుల మళ్లింపే ఏజెన్సీ వెనుకబాటుకు కారణం
* గిరిశిఖర గ్రామాల్లో 18 నెలల్లో 460 కిలోమీటర్ల మేర రోడ్లు
* జలజీవన్ మిషన్ ద్వారా రక్షిత మంచి నీరు అందిస్తాం
* నందిగరువు ‘మాటా – మంతీ’ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్

“కూటమి సర్కారు పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం’. మీ కష్టాలు వినడానికి… సమస్యలు తీర్చడానికి… కన్నీరు మీ గడప తొక్కకుండా చూడటానికి మేము ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాం. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకోవడానికి కూడా ప్రజలు భయపడేవారు. కష్టాలు చెప్పుకోవడానికి అప్పటి ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే… మీ ఊరు ఎక్కడుంది? అనే స్థాయి నుంచి… మీ సమస్యలు తెలుసుకోవడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే మీ ముందుకు వచ్చేలా పాలనను ప్రక్షాళన చేశామ’ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. కష్టపడే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడితే… మేం మరింత ఉత్సాహంగా పని చేస్తాం. మీరు సమస్యలు చెప్పుకోవడానికి రోడ్ల మీదకు రాక ముందే పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పారు. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం, నందిగరువు గ్రామంలో గిరిజనులతో నిర్వహించిన‘మాటా – మంతి’ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం సంక్షేమంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలకీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. 40 గడపలు ఉన్న నందిగరువు గ్రామానికి దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి రోడ్డు వేయించాం. గిరిశిఖర గ్రామాల్లో గర్భిణీలు పడుతున్న ఇబ్బందులు చూడలేక, ఏజెన్సీలో డోలీ మోతలు కనిపించకూడదని కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మిస్తున్నాము. మీరు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే ఏనాడూ మీ గ్రామానికి రాలేదు. మీ కష్టం వినలేదు. వారి హయాంలో నిధులు మళ్లించారు తప్పితే… ఏనాడు కూడా అభివృద్ధి ఊసే ఎత్తలేదు. జలజీవన్ మిషన్ పథకంలో రూ.4 వేల కోట్లు దుర్వినియోగం చేశారు. మేము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే గిరిజన గ్రామాల్లో 460 కిలోమీటర్ల మేర రోడ్లు వేశాం. గిరిశిఖర ప్రాంతాల్లో వేయాల్సిన రోడ్లు… ఇవ్వాల్సిన నీళ్లు… కట్టించాల్సిన పాఠశాల భవనాలు ఇంకా ఉన్నాయి. రాబోయే కాలంలో నిబద్ధతతో వాటన్నింటినీ పూర్తి చేస్తాం.
* ఈ ప్రాంతంలో కూటమి అభ్యర్థులు గెలవకపోయినా ఎక్కడా వివక్ష చూపించలేదు
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు లక్షలాది మంది మధ్య జరుపుకోవచ్చు. కానీ అరణ్యం మధ్యలో 40 ఇళ్లు మాత్రమే ఉన్న మారుమూల గిరిజన గ్రామంలో జరుపుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఈ ప్రాంతంలో ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. 70 ఏళ్లుగా రోడ్డు చూడని గ్రామానికి ఈ రోజు రోడ్డు వేయించాం. నేనే స్వయంగా వచ్చి నాణ్యతను పరిశీలించాను. ఇక్కడి ప్రజలు, యువత అండగా నిలబడితే అభివృద్ధి ఎలా ఉంటుందో మేము చేసి చూపిస్తాం. ఈ ప్రాంతంలో కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గెలవకపోయినా, మేము ఎక్కడా వివక్ష చూపించలేదు. కూటమి ప్రభుత్వం- మీరు ఓట్లు వేశారా? లేదా అని చూడదు. మీరు బాగుండాలని మాత్రమే పని చేస్తుంది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఇలాంటి మారుమూల గిరిశిఖర ప్రాంతాలకు రావాలంటే నాయకులు భయపడుతుంటారు. ప్రజల కోసం పని చేసే నాకు అలాంటి భయాలు లేవు. మీ కోసం ఎలాంటి ప్రాంతానికైనా వస్తాను. గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లకుండా అభివృద్ధి చేసి చూపిస్తాము” అన్నారు.
• సమస్యలు విని.. పరిష్కారం చూపి…
మాటా-మంతి కార్యక్రమంలో స్థానిక ప్రజలు తమ గ్రామ సమస్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని అధికారులతో చర్చించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే పరిష్కరించారు. ఓనూరు ప్రాథమిక పాఠశాలను స్వయంగా పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాలంటే ఓనూరు వెళ్లాలని నందిగరువు గ్రామస్థులు తమ వేదనను చెప్పగానే… నందిగరువు గ్రామంలోనే ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. వీబీ జీరామ్ జీ పథకం నిధులతో ఓనూరు – కొత్తపలం రోడ్డుకు అనుమతులు ఇచ్చారు. అలాగే కొత్తపలంలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నర్తనపల్లి, ఓనూరు గ్రామాల్లో మ్యాజిక్ డ్రైయిన్లను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. తాగు నీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాలను గుర్తించి జల్ జీవన్ మిషన్ పథకం నిధులతో సమస్యను పరిష్కరిస్తాం. జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ ఛైర్మన్ శ్రీ వంపూరి గంగులయ్య, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాసరావు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్, ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్, పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీ బాలు నాయక్, ఐ.టి.డి.ఎ. పీవో శ్రీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.