
ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన 13 మంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.65 లక్షల విలువైన బీమా చెక్కులను పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి, శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ పంపిణీ చేశారు. బుధవారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చెక్కులను క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు అందజేశారు. వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్న శ్రీ హరిప్రసాద్ మాట్లాడుతూ ‘కార్యకర్తల కుటుంబాలకి అండగా నిలబడాలి అన్నదే పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ అభిమతం. ఆ ఉద్దేశంతోనే బీమా పథకాన్ని తీసుకొచ్చారు. పార్టీ అన్ని విధాల అండగా నిలబడుతుంద’ని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ నేతలు శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, శ్రీ బూరగడ్డ శ్రీకాంత్ పాల్గొన్నారు.