

* ఆశాజనకంగా ధరలు
* అన్ని రకాలకూ డిమాండ్
* అయితే దిగుబడులను దెబ్బతీసిన తెగుళ్లు
* సాగు విస్తీర్ణమూ తగ్గింది
మిర్చిసాగు చేసిన రైతుకు మంచి రోజులు వచ్చాయి. ఐదేళ్లుగా గిట్టుబాటు ధరలు లేక తీవ్ర నష్టాల పాలై చాలా మంది రైతులు మిర్చి సాగు వదిలేశారు. కొందరు రైతులు సాగు విస్తీర్ణం తగ్గించుకున్నారు. అనూహ్యంగా ఈ ఏడాది జనవరి నుంచి మిర్చి ధరలు పెరగడం మొదలయ్యాయి. జనవరిలో సగటున క్వింటాకు రూ.15 వేల ధర దక్కగా నేడు క్వింటా మిర్చికి సగటున రూ.20వేల పైనే లభిస్తోంది. ధరలు పుంజుకుంటూ ఉండటంతో వ్యాపారులు గ్రామాలకు వెళ్లి పొలాల వద్దే కొనుగోలు చేస్తున్నారు. ఇక గుంటూరు మిర్చి యార్డుకు రోజుకు సగటున 1.29 లక్షల టిక్కీల సరకు వస్తోంది. 98 శాతం పైగా అమ్ముడు పోతోంది.
• సన్నరకాలకూ డిమాండ్
మిర్చి సాగు విస్తీర్ణం ఈ సీజన్‌లో ఒక్క ఏపీలోనే కాదు, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా గణనీయంగా తగ్గింది. సీజన్ ప్రారంభంలో క్వింటా సగటున రూ.10 వేల ధర మాత్రమే వుండటంతో రైతులు సాగు విస్తీర్ణం తగ్గించారు. దీనికి తోడు నల్లతామర, జెమిని వైరస్ ప్రభావంతో దిగుబడులు సగానికి తగ్గాయి. మార్కెట్లో సరకు కొరత ఏర్పడింది. దీంతో ధరలు క్రమంగా పెరిగాయి. నేడు సగటున క్వింటాకు రూ.20 వేలకు పైగా ధర దక్కుతోంది. సన్నాల ధరలు మార్కెట్ ప్రారంభంలో తక్కువుగా వున్నా మార్చి నెలలో వాటి ధరలు కూడా రూ.20 వేలకు చేరాయి. కొన్ని రకాలకు క్వింటా రూ.32 వేలపైనే ధర దక్కుతోంది.
• విపరీతంగా పెరిగిన సాగు ఖర్చులు
ఇటీవల కాలంలో ఏ పంటకూ లేని విధంగా మిర్చికి చీడపీడలు వ్యాపిస్తున్నాయి. వాటిని అదుపు చేసేందుకు రైతులు నెలకు పదిసార్లు రసాయనాలు పిచికారి చేస్తున్నారు. రసాయనాల ధరలు, కూలీల ఖర్చులు పెరిగిపోవడంతో ఎకరా మిర్చి సాగు వ్యయం రూ.4 లక్షలకు చేరింది. ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తే, అదే సమయంలో క్వింటా మిర్చికి సరాసరి రూ.18 వేల ధర వుంటే రూ.4.50 లక్షల ఆదాయం వస్తుంది. అంటే రైతుకు ఎకరాకు రూ.50 వేల లాభం లభిస్తుంది.
• దిగుబడులు తగ్గడంతో ఎగబడుతున్న వ్యాపారులు
సాగు ఖర్చులు విపరీతంగా పెరగడం, ఐదేళ్లుగా క్వింటా సగటు ధర రూ.9 వేలకు పడిపోవడంతో సాగు విస్తీర్ణం దాదాపు 50 శాతం తగ్గింది. తెగుళ్ల దెబ్బకు దిగుబడులు కూడా సగానికి పడిపోయాయి. మార్కెట్లో సరకు పెద్దగా లేకపోవడంతో మిర్చి వ్యాపారులు చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో క్వింటా తేజ మిర్చికి రూ.15 వేల ధర వుండగా నేడు, క్వింటా రూ.19500లకు చేరింది. తాలు కూడా క్వింటా రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. ధరలు ఆశాజనకంగా వుండటంతో చాలా మంది రైతులు కోత కోసి ఆరబెట్టి వెంటనే అమ్మేస్తున్నారు.
• క్రమంగా పెరిగిన ధరలు
జనవరి నుంచి మిర్చి ధరలు క్రమంగా పెరిగాయి. గత ఏడాదితో పోల్చుకుంటే బాగా పుంజుకున్నాయి. గత ఏడాది జనవరిలో తేజ మిర్చి క్వింటాకు 11 వేల నుంచి గరిష్ఠంగా 13,500 ధర దక్కింది. ఈ ఏడాది జనవరిలో 14500లకు చేరింది. మార్చిలో క్వింటా 19500 ధర దక్కుతోంది. 334 రకం క్వింటా 17 వేల నుంచి 23000కు పెరిగింది. ఆర్మూర్, 273, 341, నెంబర్ 5 రకాల ధరలు క్వింటా 19000 నుంచి 23 వేలకు పెరిగాయి. 2043 రకం క్వింటా 19000 నుంచి రూ.32000కు ఎకబాకింది. క్లాసిక్, 355 రకాలు క్వింటా 14000 నుంచి 19500కు పెరిగాయి. తాలు కూడా క్వింటా 10000 నుంచి 13000కు చేరింది.
* దిగుబడులు దిగదుడుపు
మిర్చి ధరలు ఆశాజనంగా వున్నా దిగుబడులు సగానికి తగ్గాయి. సగటున ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి వుండగా చాలా మందికి ఈ ఏడాది సగటున 15 క్వింటాళ్లకు మించే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు పది క్వింటాళ్లు మించే అవకాశం లేదు. జెమిని వైరస్, నల్లతామర, అధిక వర్షాలు మిర్చి దిగుబడులను తీవ్రంగా ప్రభావితం చేశాయని రైతులు చెబుతున్నారు. అయితే ధరలు ఆశాజనకంగా వుండటం రైతులకు కొంత ఊరటనిచ్చే అంశం.
• శీతల గిడ్డంగులపై పెరిగిన ధరల ప్రభావం
గుంటూరు సమీప ప్రాంతాల శీతల గిడ్డంగుల్లో 40 లక్షల బస్తాల సరకు చేరిందని అంచనా. వాటిలో పాతవి 10 లక్షల బస్తాల సరకు వుంటుందని అంచనా వేస్తున్నారు. ఏపీలోని మిగిలిన ప్రాంతాల్లో మరో 5 లక్షల బస్తాల సరకు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేశారని గిడ్డంగుల యజమానులు చెబుతున్నారు. ఏపీలోని శీతల గిడ్డంగుల్లో 3 కోట్ల బస్తాల మిర్చి నిల్వ సామర్థ్యం వుంది. మిర్చి ధరలు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది సగం గిడ్డంగులు కూడా నిండే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు.