డిప్యూటీ సీఎం.. మాకు పాఠశాలకు చేరే రోడ్డు వేయండి!!

  1. వాగులు దాటి స్కూల్‌కు… దేవరపల్లి మండలంలో చిన్నారుల విద్యా కష్టాలు

అనకాపల్లి: దేవరపల్లి మండలం, సింతలపూడి పంచాయితీ పరిధిలో ఉన్న బోడిగరువు గ్రామ పాఠశాలకు చేరుకోవడం సమీప గ్రామాల పిల్లలకు పెద్ద సవాలుగా మారింది. గుమ్మ పంచాయితీ కడరేవు గ్రామం నుంచి నలుగురు పిల్లలు, పినకోట పంచాయితీ కొట్టెంగూడ గ్రామం నుంచి ఎనిమిది మంది పిల్లలు ఈ పాఠశాలలో చదువుతున్నారు.

ఈ పిల్లలు ప్రతిరోజూ సుమారు నాలుగు కిలోమీటర్లు నడిచి, నాలుగు వాగులు దాటి పాఠశాలకు చేరుకుంటున్నారు. మొత్తం ఈ రెండు గ్రామాలను కలిపి సుమారు ఇరవై మంది పిల్లలు ఉన్నప్పటికీ, ప్రయాణ కష్టాల కారణంగా కేవలం పదకొండు మంది మాత్రమే పాఠశాలకు హాజరవుతున్నారు. మిగిలిన వారు ఇబ్బందుల వల్ల చదువుకు దూరమవుతున్నారు. ఈ ఫోటోలు కడరేవు మరియు కొట్టెంగూడ గ్రామాల మధ్య వాగుల వద్ద తీసినవిగా తెలియజేశారు.

రోడ్డు సదుపాయాల విషయానికి వస్తే, రోడ్ సమీపం నుంచి బోడిగరువు – నేర్లపాడు వరకు నాలుగు కిలోమీటర్ల మట్టి రోడ్డు నిర్మించబడింది. నేర్లపాడు నుంచి కొట్టెంగూడ, కడరేవు, కర్రిగూడ, గుమ్మ వరకు తొమ్మిది కిలోమీటర్ల రహదారికి 7.5 కోట్లు మంజూరు అయినప్పటికీ, ఇప్పటివరకు కేవలం 1.5 కిలోమీటర్లు మాత్రమే నిర్మాణం పూర్తయ్యింది.

సరైన రహదారి సదుపాయాలు లేకపోవడం వల్ల చిన్నారులు ప్రాణాపాయ పరిస్థితుల్లో చదువుకోడానికి వెళ్లాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎంత ముఖ్యమో ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.