పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ నిర్మాణ పనులపై సమీక్ష

గుంటూరు జోన్ పరిధిలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ మరియు అనుబంధ ఆసుపత్రి పనులపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ అధ్యక్షత వహించగా, పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్లా సమక్షంలో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఏపిఎంఎస్ఐడిసి ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని, నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, త్వరలోనే అడ్మిషన్లు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ…. సుమారు ₹450 కోట్ల వ్యయంతో, కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ₹195 కోట్ల సహకారంతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు.

మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీ, విద్యార్థుల హాస్టల్స్ మరియు అనుబంధ ఆసుపత్రిని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పానికి అనుగుణంగా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్ట్‌ను వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ప్రారంభమై నిలిచిపోయిన పనులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పునరుద్ధరించి, ప్రతి పేదవాడికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో దాదాపు పూర్తి దశకు తీసుకువచ్చినట్లు తెలిపారు. మరో నెల రోజుల్లో మిగిలిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాలు, పల్నాడు జిల్లా మరియు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే కేంద్రంగా ఈ మెడికల్ కాలేజీని తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఏపిఎంఎస్ఐడిసి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, సైట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.