రాజోలు నియోజకవర్గం “వర్చువల్” సమావేశంలో జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు రాజోలు నియోజకవర్గంలో సమిష్టి నిబద్దతతో జనసేన గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలపై స్థానిక వైసీపీ నాయకులు అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేయడం దుర్మార్గమైన చర్య అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు స్పష్టం చేశారు. జనసేన కార్యకర్తల ఖచ్చితత్వం, ముక్కుసూటితనంకు భయపడి కేసులతో బెదిరింపులకు గురి చేయాలనుకోవడం అవివేకమని అన్నారు. రాజోలు నియోజకవర్గం జనసేన కార్యవర్గంతో మంగళవారం జరిగిన “వర్చువల్” సమావేశంలో శ్రీ నాగబాబు గారు మాట్లాడారు. రాజోలు పరిసర ప్రాంతాల్లో భూ గర్భ జల కాలుష్యం వలన ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటోందని, భూ గర్భ జల కాలుష్యం విస్తరించి రాష్ట్రం అంతా ఉద్దానంలా తయారయ్యే ప్రమాదం ఉన్నదని అన్నారు. భూగర్భ జలం కాలుష్యం అవ్వకుండా కాపాడాలనే ఆలోచన వైసీపీ ప్రభుత్వంలో కనిపించడం లేదని, జనసేన ప్రభుత్వం స్థాపించిన వెంటనే భూగర్భ జల కాలుష్యం అరి కట్టడానికి పరిష్కార మార్గాలు చేపడతామని అన్నారు. నీటి కాలుష్యము వలన 10 వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు మురిగిపోతున్నాయనే విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ముంపునకు గురవుతున్న తీర ప్రాంత ప్రజల రక్షణ కోసం జనసేన చిత్తశుద్దితో పని చేస్తుందని అన్నారు. స్థానిక సంస్థలకు కేటాయించాల్సిన నిధులను పక్క దారి పట్టించి, మద్యం, ఇసుక ఇతర ఆదాయాలను వ్యవస్థనుండి దారి మళ్లించి వ్యక్తుల వ్యక్తిగత లాభార్జనకు మళ్లిస్తున్నారని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, జీవనోపాధి కల్పించక పోగా ఉన్న జీవన ఆధారాన్ని కూడా ధ్వంసం చేస్తున్నారని అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేశ్ గారు నేతృత్వంలో నాయకులు, వివిధ కమిటీల సభ్యులు, క్రియాశీలక కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.