తూర్పుగోదావరిలో ముగిసిన జనసేన ప్రజా పోరాటయాత్ర…

ప్రజల సమస్యల మీద పోరాడేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గారు ప్రజాపోరాటయాత్ర ప్రారంభించారు. ఈ పోరాటయాత్ర శ్రీకాకుళం నుండి మొదలుకుని విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో ముగించుకుని అనంతపురంలో అడుగుపెట్టనుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్ర ముగించుకుని ధవళేశ్వరం బ్యారేజీ మీద కవాతు నిర్వహించిన జనసేనాని మూడు విడతల్లో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. కవాతుకు లక్షలాది మంది తరలి రావడంతో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసిన సంగతి తెలిసిందే! తూర్పు పర్యటనలో భాగంగా కాకినాడ, రాజమండ్రి, అమలాపురంలో బస చేసిన జనసేనాని వివిధ వర్గాల ప్రజలతో సమావేశమయ్యారు. అన్ని నియోజకవర్గాల ప్రధాన పట్టణాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో స్థానిక సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీసిన పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షం చేతకానితనాన్ని ప్రజలకు తెలియజేసారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కేంద్ర ప్రధాన పార్టీల వైఖరిని ఎండగట్టారు. వంతాడలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఆగ్రహించిన జనసేనుడు అక్రమ మైనింగ్ చేస్తున్న యాజమాన్యంపై మండిపడ్డారు. కాకినాడ పోర్ట్ ద్వారా జరుగుతున్న అక్రమాలపై కన్నెర్ర చేసిన జనసేనుడు కోనసీమలో పెరిగిపోతున్న గ్యాస్ దోపిడీపై గళమెత్తారు. ఈ పర్యటనలో అర్ధరాత్రి సమయంలో తాను నివసిస్తున్న హోటల్ కి అధిక సంఖ్యలో అభిమానులు వచ్చారన్న సంగతి తెలుసుకుని ఆ సమయంలో కూడా వారికి అభివాదం చేస్తూ వారితో కొంత సమయం గడిపారు. తూర్పుగోదావరిలో ఎక్కడికి వెళ్ళినా మరీ ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో అభిమానులు జనసేనుడికి బ్రహ్మరథం పట్టారు.

జనసేనాని తమ ఊరుకి వస్తున్నాడని తెలుసుకున్న మహిళలు హారతులతో నీరాజనాలు పలికారు. ఈ పర్యటనలో భాగంగా రెల్లి కులస్థులతో సమావేశమయ్యిన జనసేనాని వారి సమస్యలు తెలుసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. రెల్లి కులస్థుల సమస్యలు తెలుసుకునేందుకు తానే స్వయంగా రెల్లి కాలనీను సందర్శించారు. డాక్టర్లతో, విద్యార్థులతో, జనసైనికులతో, చేనేత కళాకారులతో ఇలా అనేక వర్గాల ప్రజలతో జనసేనాని సమావేశమయ్యి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎన్నో అంచనాల నడుమ తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టిన జనసేనుడిని అంచనాలకు మించి ఆదరించిన తూర్పు వాసులకు ధన్యవాదములు. తూర్పుగోదావరి జిల్లా పర్యటన ముగించుకున్న జనసేనాని అనంతపురంలో పోరాటయాత్ర కొనసాగించనున్నారు. డిసెంబర్ 2వ తేదీన అనంతపురం మార్కెటింగ్ యార్డ్ సర్కిల్ నందు జరగనున్న కవాతు ద్వారా అనంతపురం పర్యటన ప్రారంభంకానుంది. ఈ కవాతుకి లక్షలాది మంది జనసైనికులు తరలిరావాలని కోరుతున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp chat