తిత్లీ తుపాను నష్ట పరిహారం సాధించేందుకు బాధిత గ్రామాల ప్రజలంతా కలసికట్టుగా నిలబడాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్‌కళ్యాణ్ గారు సూచించారు. విశాఖపట్నంలో తిత్లీ తుపాను బాధిత గ్రామాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు.
గ్రామాల్లో పునరావాస కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనే అంశంపై ఆరా తీశారు. బాధితుల సూచనలు విన్న అనంతరం శ్రీ పవన్‌కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తుపాను బాధితులకి జనసేన పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుంది. ఎవరి స్థాయిలో వారు అంతా కలసి పోరాటం చేయాలి. ఎవరికి వారు వ్యక్తిగత లబ్ది చూసుకుంటే, పరిస్థితులు మన చేతిలో ఉండవు. తిత్లీ తుపాను నష్టానికి సంబంధించి జనసేన పార్టీ పక్షాన పూర్తి స్థాయి నివేదిక రూపొందిస్తున్నాం. దాన్ని కేంద్రం వరకు తీసుకెళ్తాం. మీకు అండగా నిలబడతాం. అదే సమయంలో మీరు కూడా ఒకటిగా ఉండాలి. రెండు ముఖ్య డిమాండ్లను జనసేన పార్టీ తరఫున ప్రభుత్వం ముందు ఉంచబోతున్నాం. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వంద శాతం రుణమాఫీ చేయాలి. అదే సమయంలో 10 ఏళ్ల పాటు రైతులకి పరిహార భృతి ఇవ్వాలని కోరుతున్నాం. ఈ భృతి ఎంత మొత్తం ఇవ్వాలి అని డిమాండ్ చేయడం గురించి చర్చిస్తున్నాము. అల్లాగే వ్యక్తిగతంగా చాలా మందితో సంప్రదింపులు జరుపుతున్నాం. తుపాను కారణంగా బాగా నష్టపోయిన గ్రామాలని దత్తత తీసుకోమని కోరుతున్నాం. ఈ విషయంలో మీ సహకారం కావాలి. మీ నియోజకవర్గాల్లో బాగా దెబ్బతిన్న గ్రామాల వివరాలు మాకు తెలియచేయండి.
తుపాను నష్టం ఎంత అనే అంశం ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియడం లేద”న్నారు. అంతకు ముందు తిత్లీ తుపాను బాధితుల సమస్యలను శ్రీ పవన్‌కళ్యాణ్ గారు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సావధానంగా విన్నారు. ఇప్పటికీ చాలా గ్రామాలకి నీరు, ఆహారం కూడా అందడం లేదని బాధితులు వెల్లడించారు. ఆహారం కూడా సొంత ఖర్చులతో సమకూర్చుకుంటున్నట్టు తెలిపారు. తుపాను ప్రాణాలను అయినా మిగిల్చిందనీ, పొలాల్లో ఎండిన జీడి చెట్లను వెంటనే తొలగించకుంటే ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతాయోనని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. పరిహారం కోసం ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తున్నారనీ, ఎమ్మెల్యేలు కులం పేరుతో దూషిస్తున్నారన్న అంశాలను కూడా బాధిత గ్రామాలవారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందు ఉంచారు.