మదనపల్లె : తుఫా ను ధాటికి నష్టపోయిన రైతాంగానికి రూ.15 వేలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని, వైసిపి ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, తుఫాను సమాచారం సైతం రైతుల పట్ల ఉదారంగా ఆదుకోవడంలో విఫలమైందని జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి విమర్శించారు. తుఫాను దాటికి మదనపల్లె మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను కలసి వివరాలు సేకరించారు. గురువారం మదనపల్లె తహసీల్దారు కార్యాలయం వద్ద రైతుల పట్ల వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం తహసీల్దారు మహబూబ్ చాంద్ తో జనసేన పార్టీ తరుపున రాయలసీ మ కో కన్వీ నర్ గంగారపు రాందాస్ చౌదరి, జనసేన పార్టీ నాయకులు సమావేశమై రైతుల దుస్దితి వివరించి, వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతాం గాన్ని ఉదారంగా అదుకోవాలని కోరారు. ఆరుగాలం కష్టపడి పంటపండించే రైతులు తీవ్రంగా నష్ట పోయారని వారికి ఎకరాకు రూ.15 వేలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె , రామసముద్రం , మదనపల్లె మండలలోని రైతంగం తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. జనసేన పార్టీ నాయకులతో కలిసి దెబ్బతిన్న పంటలు పరిశీలించిన సమయంలో నిమ్మనపల్లె , పొన్నూటిపాలెం , అంకిశెట్టి పల్లె రైతులదీన అవస్థ కళ్లారాచూడటం జరిగిందని అన్నారు. అగ్రికల్చర్ అధికారులు అప్పుడప్పుడు వెళ్లి చూడటమే కానీ, ఉన్నతాధికారులు, ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఎవరు కూడా రైతుల దుస్దితి తెలుసుకుని పరామర్శించిన దాఖలు లేదన్నారు. రైతులను ఆదుకోవాలని, ప్రభుత్వం నష్టపోయిన రైతులను గుర్తించి పరిహారం అందించాలని జనసేన పార్టీ తరపున తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించడం జరిగిందన్నారు. నష్టపోయినవరి, టమోటా, ఉద్యా నవన, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.15 వేలు అందించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్య క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, రెడ్డెమ్మ, జంగాల గౌతమ్, జయ, నవాజ్, నాగ, లవన్న , జనార్దన్, రాజారెడ్డి , పవన్, నాగవేణి, మజ్జల నవీన్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.