వైసీపీపై పోరులో భాగంగా తొలిసారి టీడీపీ-జనసేన సమన్వయకమిటీ సమావేశమై కీలకాంశాలపై చర్చలు జరిపింది. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చబోనన్న దానికిి కట్టుబడి ఉన్నామని మరోసారి జనసేనాని పవన్ స్పష్టం చేశారు. వైసీపీని గద్దెదించి, రాష్ట్రాన్ని అభివృద్ధిదిశగా తీసుకెళ్లడమే లక్ష్యంగా తమ భేటీ జరిగిందన్నారు పవన్. రాష్ట్రానికి వైసీపీ తెగులు పట్టిందని.. దానికి టీడీపీ-జనసేన వ్యాక్సీన్ సిద్ధంగా ఉందన్నారు జనసేనాని.
చంద్రబాబును అక్రమంగా అకారణంగా జైల్లో పెట్టారన్నారు పవన్. సాంకేతిక అంశాల పేరుతో బెయిల్ రాకుండా చేస్తున్నారు. చంద్రబాబుకు మద్దతిచ్చేందుకే రాజమహేంద్రవరంలో భేటీ అయ్యాం. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే మేం కలిశాం. ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా ఉండాలనే దానిపై చర్చించాం. తెదేపా-జనసేన ఎలా కలిసి పని చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించాం. త్వరలో కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తాం’’ అని పవన్ అన్నారు.
విజయదశమి రోజు టీడీపీ-జనసేన సమావేశం.. రాష్ట్రానికి మేలు చేస్తుందన్నారు నారా లోకేశ్ . ఈ రెండు పార్టీలు కలిసి వెళ్లాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘‘వైసీపీ పాలనలో బీసీ ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలు వేధింపులకు గురవుతున్నారన్నారు లోకేష్. వైసీపీ నేతల వేధింపులతో ముస్లిం సోదరులు ఆత్మహత్య చేసుకున్నారు’’ అని లోకేశ్ అన్నారు. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని లోకేశ్ తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని పలురకాలుగా వేధిస్తున్నారని మండిపడ్డారు. ‘‘సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రభుత్వ చేతకానితనం కనిపిస్తోంది. నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే రెండు పార్టీల నేతలం భేటీ అయ్యాం’’ అని లోకేశ్ అన్నారు.
నవంబర్ 1న ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని లోకేశ్ అన్నారు. ఓటరు జాబితాపై అక్రమాలపై క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా పరిశీలిస్తామన్నారు. ‘‘వందరోజుల కార్యాచరణ ప్రకటించాం. నవంబర్ 1 నుంచి మ్యానిఫెస్టో ప్రకటించి ప్రచారం ప్రారంభిస్తాం. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తాం. ఈ సమావేశంలో మూడు తీర్మానాలు చేశాం. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఒక తీర్మానం, అరాచక వైసీపీ పాలన నుంచి ప్రజలను రక్షించాలని మరొకటి, రాష్ట్రాభివృద్ధి కోసమే కలిసి పోరాటం చేయాలని మూడో తీర్మానం చేశాం’’ అని లోకేశ్ తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.