ఆలయానికి చెందిన ఆస్తులన్నీ అందినంత వరకూ దోచుకుంటున్నారు
కాగితాలకే పరిమితమైన స్వయం ప్రతిపత్తి గురించి బహిరంగ చర్చ జరగాలి
దేవస్థానం నిర్వహణలో ఖచ్చితమైన జవాబుదారీతనం ఉండాలి
జనసేన ప్రభుత్వంలో విభిన్న వర్గాల అభిప్రాయానికి ప్రాధాన్యమిస్తాం ప్రభుత్వాలు మారినప్పుడల్లా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ వ్యవహారాలలో ఆయా పార్టీల నాయకుల అజమాయిషీ పెరగడం, తమ ప్రభుత్వమే అనే ధీమాతో అయిదేళ్ల పాలనలో అందినంత సొమ్ములు దోచుకోవడం అనాదిగా చూస్తూనే ఉన్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కానుకల రూపంలో ప్రతీ రోజు వస్తున్న కోట్లాది రూపాయల ఆదాయంపై లెక్కా పత్రం లేకుండా పోతోంది. ఎన్నో శతాబ్దాల ప్రఖ్యాతి గాంచిన తిరుమల పుణ్య క్షేత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ఎకరాల భూములు, టన్నుల కొద్దీ బంగారం, ఇతర ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. గంజాయి, సిగరెట్, గుట్కా, మద్యం లాంటివి తిరుమల కొండపై యధేచ్చగా విక్రయించడం ఆలయ ధర్మానికి విరుద్ధం. కొండపై మాదక ద్రవ్యాలు దొరికినప్పుడల్లా నిర్లక్ష్యంతో చేతులు దులుపుకుంటున్నారు తప్ప వాటిని అరికట్టే విషయంలో లోపం కనబడుతోంది. విభిన్న రకాల ధార్మిక సంస్థలు దాదాపుగా ఆయా సంస్థల స్వయం ప్రతిపత్తితోనే నిర్వహించబడతాయి. హిందూ మతానికి చెందిన దేవాలయాలు, ధార్మిక సంస్థలు చాలా వరకు దేవాదాయ శాఖ పరిధిలో నిర్వహించబడుతున్న కారణంగా కొన్ని సందర్భాల్లోహిందూ విద్వేషకులు మదమెక్కి హిందూ దేవాలయాలపై దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారు. దీని వలన కొంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం స్వయం ప్రతిపత్తి అనేది కాగితాలకే పరిమితమైంది తప్ప ఆచరణలో ఆ ఊసే కనిపించడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం స్వయం ప్రతిపత్తి పాలన గురించి బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఖచ్చితమైన జవాబుదారీతనం ఉండాల్సిందే. ఎన్నో వేల సంవత్సరాలుగా అనేక రకాల దాడులను ఎదుర్కొంటూ స్వతంత్రంగా, సజీవంగా నిలబడిన సనాతన ధర్మంను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడికి ఉన్నది. జనసేన ప్రభుత్వ పాలనలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా టీటీడీ ధర్మకర్తల మండలి, హిందూ ధార్మిక సంస్థలు, అత్యధిక మంది భక్తుల అభిప్రాయాలను సేకరిస్తాం. స్వయంపాలన అన్నదే విభిన్న వర్గాల అభిప్రాయం అయితే ఇంతకాలం కాగితాలకే పరిమితమైన స్వయం ప్రతిపత్తి అనేది ఎలా ఉంటుందో ఆచరణలో చేసి చూపిస్తామని శ్రీ నాగబాబు స్పష్టం చేశారు.