కాంగ్రెస్ చేసిన ద్రోహానికి మూడు ఎన్నికల దాకా ఆంధ్రప్రదేశ్ లో చోటు లేదు – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం బహిరంగ సభలో జనసేనాని ప్రసంగం :

* ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకు, అక్కచెల్లెల్లకు, ఆడపడుచులకు, జనసైనికులకు, పెద్దలకు పేరుపేరునా హృదయపూర్వక నమస్కారములు.

* అవమానాలు, కన్నీళ్లు, మోసం, అవినీతి, దగ, దౌర్జన్యం పెరిగిపోతున్న రోజుల్లో రాజకీయ జవాబుదారీతనం లేని రోజుల్లో 2014లో వేల కోట్లు లేకుండా జనసేన పార్టీ స్థాపించాను.

* చాలా గొడవల మధ్య, ఉద్రిక్తితల మధ్య ఏ మాత్రం భయపడకుండా బలంగా జనసేన పార్టీ పెట్టాను. తెలుగుజాతిని నిట్ట నిలువునా చీల్చేశారని బాధ కలిగి పార్టీ పెట్టాను. అలాంటి సమయంలో ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే వ్యక్తి రావాలని భావించి రాజకీయాల్లోకి వచ్చాను.

* నాకు సమాజం బాగుపడాలని ఉండేది కాని రాజకీయాల మీద ఆసక్తి ఉండేది కాదు. ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని భావించి రాజకీయాల్లోకి వచ్చాను.

* జై భీం అని జెండా పట్టుకోవడానికి కారణం..అంబేద్కర్ గారు అణగారిన, వెనుకబడ్డ కులాలు అని అంటే ఇప్పడు రాజకీయ వ్యవస్థ వల్ల తెలంగాణాలో ఆంధ్రప్రదేశ్ లో గల ఒకే కులాలు వేరు వేరు అయిపోయాయి. ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.

* అడ్డగోలుగా దోచేస్తుంటే పెద్ద నాయకులు మాట్లాడతారేమో అని నేను చాలా రోజులు చూసాను. రాష్ట్ర విభజన గోటితో పోయేది, దానిని గొడ్డలి దాకా తీసుకొచ్చారు.

* తెలంగాణ నాయకులు ఆంధ్రప్రజలను దోపిడీ దారులని మాట్లాడుతూ ఉంటే ఏ ఒక్కరూ మాట్లాడరు. చంద్రబాబు గారు ఈ విషయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. జగన్ గారిని తెలంగాణాలో రాళ్లతో కొట్టినప్పటి నుండి మళ్ళీ తెలంగాణ వెళ్ళలేదు. 

* కొన్ని కుటుంబాలు చేసిన తప్పుకి కోట్లాది మంది ప్రజలు బాధ పడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పుకి మనం ఎందుకు దెబ్బ తినాలి. ప్రజలు సామాన్యులు. 

* అరుపులతో మార్పు రాదు, ఆలోచనలతో మార్పు వస్తుంది. ఆలోచన దహిస్తుంది, చలనం వచ్చేలా చేస్తుంది. అంబేద్కర్ లా జ్వలించాలి.

* అంబేద్కర్ గారు వెనుకబడ్డ వర్గాలు, దళితులు ఏకమవ్వాలంటే తెలంగాణాలో మాత్రం దళితులనే వేరు చేశారు. పాలకులు చేసిన తప్పులకు ప్రజలు ఎందుకు కష్టాలు పడాలి?

*  ప్రజల పక్షాన ఏ ఒక్కరూ మాట్లాడట్లేదు. మాట్లాడితే! ముఖ్యమంత్రి గారికి హెరిటేజ్ ఫ్యాక్టరీలు ఆపేస్తారని భయం, జగన్ గారికి కాంట్రాక్టులు ఆపేస్తారని భయం. 

* జగన్ గారు గాని, చంద్రబాబు గారు గాని తెలంగాణ వెళ్తే రానివ్వరు. పవన్ కళ్యాణ్ వెళ్తే మాత్రం రానిస్తారు. దానికి కారణం మనం సత్యం మాట్లాడతాం..ధర్మం పాటిస్తాం..ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలను చేస్తాం..   

* మన ఆంధ్ర ఎంపీ లను పార్లమెంట్ లో బయటకు రానివ్వకుండా కొట్టి అవమానం చేసి తన్ని తరిమేస్తే నాకు బాధ కలిగింది. 60 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశంలో కోట్ల మందిని రిప్రజెంట్ చేసే ఎంపీలను కొడితే వీరికి పౌరుషం రాదా? అనిపించి నేను రాజకీయాల్లోకి వచ్చాను. 

* ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విభజిస్తున్నప్పుడు కనీసం పార్లమెంట్ లో ఎంత మందికి ఇష్టం అని కూడా అడగలేదు, చిన్న గ్రామ స్థాయిలో ఏదయినా నిర్ణయం తీసుకోవాలంటే అందరినీ అడుగుతారు. అలాంటిది పార్లమెంట్ లో అడగరా? దీని మీద అడిగేవాడు ఒక్కడు లేడు, దమ్మున్న నాయకుడు ఒక్కడు లేడు.

* తెలంగాణ నాయకులకు ఆంధ్ర పాలకులను, ఆంధ్ర ప్రజలను వేరు చేసి మాట్లాడకండి అని నేను చెప్పాను. 

* పార్టీ పెట్టినప్పుడు గెలుస్తామో లేదో తెలియదు గాని తప్పు చేసిన వారిని చొక్కా పట్టుకుని నిలదీద్దామని రాజకీయాల్లోకి వచ్చాను.

* మా అమ్మని, అన్నయ్య ని, వదినను, కుటుంబ సభ్యులను కాదని తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపితే!! వాళ్ళ ఎంపీలను చితకొట్టిన కాంగ్రెస్ తో తెలుగుదేశం వారి కలిశారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోలేని విధంగా కాంగ్రెస్ కాళ్ళు తెలుగుదేశం పట్టుకుంది. 

* కాంగ్రెస్ పార్టీ మనకి అన్యాయం చేసింది అని పెద్ద పెద్ద నాయకులు బయటకి వస్తుంటే చంద్రబాబు గారు వెళ్లి వాళ్ళతో కలిశారు. తెలిసి పాపం చేస్తే కొన్ని ఏళ్ళు ఏడ్చినా గాని పాపం తీరదు.

* కాంగ్రెస్ చేసిన ద్రోహానికి మూడు ఎన్నికల దాకా ఆంధ్రప్రదేశ్ లో చోటు లేదు. దీనికి కారణం ఏంటంటే మీ వల్ల ఉత్తరాంధ్ర కు చెందిన వెనుకబడిన కులాలు తెలంగాణాలో ఓసీ లుగా మారిపోయారు. నాగార్జునసాగర్ జలాలు కావాలని గొడవలు జరుగుతున్నాయి. అలాంటి పార్టీతో చంద్రబాబు కలిస్తే నాకు అసహ్యం కలిగింది. 

* మా అన్నని కాదని తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపితే, మీకు అండగా వున్న జనసైనికులను కాదని కాంగ్రెస్ కాళ్ళు పట్టుకుంటే మాకు బాధ కలిగింది.

* నారు, నీరు, నోరు ఎక్కడ బాగుంటే ఆ రాజ్యం బాగుంటుంది. మన ఆంధ్రప్రదేశ్ లో అవి ఉంటే అభివృద్ధి జరుగుతుంది కదా అని తెలుగుదేశానికి మద్దతు తెలిపాను. 

* 2014లో నేను ఎన్నికల్లో పోటీ చేయకుండా..ఓట్లను చీల్చకుండా..అన్నిటిని త్యాగాలు చేసి తెలుగుదేశంకు మద్దతు తెలిపాను. అవినీతి లేకుండా, ఏ గొడవలు జరగకుండా వుండే ఆంధ్రప్రదేశ్ ని ఇవ్వండి అని ఆరోజున నేను తెలుగుదేశాన్ని కోరాను. 

* ఒక స్వతంత్య్ర అభ్యర్థిగా పిఠాపురం ఎమ్మెల్యే గెలిచారు. ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు రాజులు కాదు, మేము మీ బానిసలం కాదు. 

* పేకాట క్లబ్బులను ఎమ్మెల్యేలు నడిపించడమేంటి? బ్రోకర్లుగా, పేకాటరాయుళ్ళుగా ఉండొచ్చుగా..దానికి మీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు?

* నిజమైన పాలన రావాలంటే బాధ్యత గల ఎమ్మెల్యేలు, మంచి నడవిక గల ఎమ్మెల్యేలు ఉండాలి. 

* సీఎం సీఎం అనే పదాన్ని నెను అరుపులుగా చూడను, అదో మహా మంత్రం. శ్రీపాద వల్లభుడు గల పిఠాపురంలో మీరు సీఎం సీఎం అని అరుస్తుంటే ఆ వల్లభుడు ఆశీర్వదిస్తాడు. 

* లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి, మీరు అనుభజ్ఞులు అని మీకు మద్దతు తెలుపుతున్నాను అని చంద్రబాబు గారితో అంటే!!ఆయన మీకు ఏమి కావాలి అని అడిగారు, దానికి బదులుగా నాకు ప్రజల క్షేమం కావాలి, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా సమాన న్యాయం చెయ్యండి, ఎమ్మెల్యేలను జాగ్రత్తగా ఉండమనండి అని అడిగాను. అది తప్ప ఈ ప్రభుత్వంలో మిగతావి అన్నీ చేశారు. 

* మేము ఓట్లు వేస్తే మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. మీరు అశోకుడిలా యుద్ధాలు చేసి రాజ్యాలు సంపాదించలేదు. మా ఓటు అనే ఆయుధంతో బోటు వేసుకుని మీరు తీరం దాటారు. అది మర్చిపోకండి. 

* దెందులూరు ఎమ్మెల్యే ఆడపడుచులను కొడతారు, మేము అంబేద్కర్ గారి జెండాలు ఎగరేస్తుంటే తెలుగుదేశం నాయకులు కులాల పేరుతో దళితులను దూషిస్తున్నారు, పిఠాపురం ఎమ్మెల్యే పని చేయలేదని ఒక అధికారిని మీద దాడి చేశారు. ఆడపడచుల మీద చేయి వేస్తే తోలు తీస్తాం..పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తాం.

* ఎమ్మెల్యేలు ఏమైనా దిగి వచ్చారనుకుంటున్నారా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మెడలు వంచి కింద కుర్చోపెడతాము. ఢిల్లీ కి రాజైనా తల్లికి కొడుకే!!ఎమ్మెల్యే అయినా..ముఖ్యమంత్రి అయినా..ప్రధాన మంత్రి అయినా సాధారణ మనిషే!!ఇది మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. 

* శ్రీ పాద వల్లభుడు పీఠం నుండి చెప్తున్నాను, ప్రతీ ఎమ్మెల్యే, ఎంపీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చెయ్యండి. పాపాలు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, దౌర్జన్యాలు చేసే వ్యాపార వేత్తలు చింతకాయల్లా రాలిపోతారు. మీరు చేసిన పాపాలకు మద్దతు తెలిపిన వారు దీపావళి టపాసులలా పేలిపోతారు.  

* ప్రకృతిని ధ్వంసం చేసేస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి గారు మొక్కలని కాపాడమని హోర్డింగ్లు పెడుతున్నారు. ఒకవైపు అడవులను ధ్వంసం చేస్తూ, మొక్కలలో డబ్బులు దొబ్బేస్తూ మీరు ప్రకృతిని ఏమి ప్రేమిస్తారు? ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు?

* ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ఖజానాకు ధర్మకర్త మాత్రమే!!అడ్డగోలుగా దోచేస్తే కుదరదు.

* శ్రీ పాద వల్లభుడి పుస్తకాలలో నువ్వు ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది అని ఉంటుంది. నేను ధర్మానికి కట్టుబడి ఉన్నా…ఏ దేవుడు లేని చోట విరిగిపోయిన మంచం కోడులే దేవుళ్ళు అని అంటారు. మనకి చంద్రబాబు గారు, జగన్ గారి రూపంలో రెండు విరిగిపోయిన మంచం కోడులు ఉన్నాయి.

* నేను చంద్రబాబు గారిని, జగన్ గారిని గాంధీ గారితో గాని..ప్రకాశం పంతులు గారితో గాని, అంబేద్కర్ గారితో గాని, వల్లభాయ్ గారితో గాని పోల్చలేను. అందుకే వారిని మంచం కోడెలు అంటున్నాను. 

* అవకాశవాద రాజకీయాలు చేసే ఇద్దరిలో ఒకరికి అవినీతి అభియోగాలు ఉన్నాయి అని వేరే వారికి మద్దతు తెలిపాను. కాని ఈరోజున అవినీతితో తెలుగుదేశం పార్టీ నిండిపోయింది.

* నేను తెలుగుదేశం వారిలా మనస్సులో ఒకటి పెట్టుకుని నాలుక మీద తేనే పూసినట్టు బయటకు ఒకటి మాట్లాడలేను. ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా మారిపోయాడు అంటారు. ఎదురుగా కనపడినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి అని ముఖ్యమంత్రి గారు అంటారు. వెనుక నుండి నా మీద టీవీల్లో ప్రోగ్రాంలు చేయిస్తారు, అంతకంటే నా మీద డైరెక్ట్ గా గొడవ పెట్టుకోవోచ్చు కదా!

*  అనుభవం వున్న వ్యక్తులు కావాలని నేను కోరుకుంటాను. డాక్టర్ అవ్వాలన్నా..పోలీసు అవ్వాలన్నా.. కొన్ని సంవత్సరాల చదువు ఉండాలి. అలాంటిది ఇన్ని కోట్ల మందిని ప్రభావితం చేసే రాజకీయాలకు కనీసం దశాబ్దం అనుభవం కావాలి. ప్రజా సమస్యలు తెలుసుకోకుండా పోటీ చెయ్యడం ఎందుకు అని ఆలోచించి నేను తెలుగుదేశానికి మద్దతు తెలిపాను.

* ప్రభుత్వం అంటే ఎవరొకరు ఉండాలి. నేను అనుకున్న విలువలు చంద్రబాబు గారిలో లేకపోయినా గాని మారతారనుకుని మద్దతు తెలిపాను. ఈరోజున వారి పాలన చూస్తే అవినీతితో నిండిపోయింది, పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు, అన్ని కులాల మీద దాడులు చేస్తున్నారు, ఇవన్నీ నాకు చాలా బాధ కలిగించాయి. 

* వంతాడలో సంవత్సరానికి 3000 కోట్ల రూపాయలు, సూరంపాలెంలో మట్టిలో సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు..ఏ మూలకి వెళ్లినా ఇలానే దోచేస్తున్నారు. 

* నాథుడు లేని రాజ్యం నానా దారుల్లో పోకూడదు అని భావించి మంచో చెడో అని తెలుగుదేశానికి మద్దతు తెలిపాను. నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళ తప్పులు గ్రహించి ఈరోజున ప్రజాపోరాటయాత్ర ద్వారా మీ దగ్గరకి వచ్చాను. నిజంగా తెలుగుదేశం వారు మంచి పాలన అందిస్తే నేను వారితో గొడవ పెట్టుకునే వాడిని కాదు.

* పంచాయితీ ఎన్నికల్లో పోటీ చెయ్యని వ్యక్తి పంచాయితీ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ ను ఏలుతున్నారు. కొడుకుని దారి తెచ్చుకోండి కానీ కష్టపడమనండి. లోకేష్ గారిని శ్రీకాకుళం నుండి అనంతపురం వరకూ తిరగమనండి, దళిత వాడల్లో తిప్పండి. 

* ప్యాంటు షర్ట్ వేసుకుని ఏసీ రూముల్లో కూర్చుని పథకాలు రూపొందిస్తామంటే! మీ పథకాలు ఎవరికి చేరుతున్నాయి. వేల కోట్లు దోచేస్తుంటే మేము చూస్తూ కూర్చోవాలా? అంబేద్కర్ గారి స్ఫూర్తి నింపుకున్నోడిని, ఆంధ్రకేసరి ధైర్యం గుండెల్లో నింపుకున్న వాళ్ళం, పొట్టి శ్రీరాముల త్యాగ స్ఫూర్తిని అణువణువునా ఎక్కించుకున్న వాళ్ళం, వల్లభాయ్ గారి జాతి సమగ్రతను సంపూర్ణంగా అర్ధం చేసుకున్నవాళ్ళం, గాంధీ గారి సహనాన్ని పాటించేవాళ్ళం, అవసరమైతే తప్పు చేసిన వారి తోలు తీసే చంద్రబోస్ గారి స్ఫూర్తిని కూడా గుండెల్లో పెట్టుకున్నాం.. 

* ఇంత మంది యువత జనసేన సభలకు రావడానికి ముఖ్య కారణం ఉద్యోగాలు లేకుండా చేసిన ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి. యువతకు 25 కేజీల బియ్యం కాకుండా 25 సంవత్సరాల భవిష్యత్తుని ఎలా ఇద్దామా అని ఎవరూ ఆలోచించరు.  

* ఒక ఇంజినీరింగ్ చదివిన విద్యార్థికి 6-8 వేలు వస్తే ఉపయోగమేముంది? డాక్టర్ లు చదివిన వారికి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. యువతకు 2000 పడెయ్యడానికి వారేమైనా భిక్షగాళ్లా?

లోకేష్ గారికి కూడా 1500 ఇచ్చి ఇంట్లో కూర్చోమని ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి. వారి కొడుకులకు మాత్రం మంత్రి పదవులు కావాలా? మాకు కనీసం ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు. 

* ప్రతీ ఎమ్మెల్యే కొడుకులకు మంత్రి పదవులు కావాలి గాని మేము మీకు మాత్రం బానిసత్వం చెయ్యాలా? మేము మీకోసం పని చేస్తే మీరు పేకాటలు ఆడుకుంటారా? ఖనిజాలను దోచేస్తారా? ఏమనుకుంటున్నారు ఒక్కొక్కరు? అడిగే వారు లేకపోతే ఇష్టానుసారం దోచేస్తారా? ఒక్కొక్కడిని ఇంట్లో నుండి లాగి నడి రోడ్డు మీద నిలబెడతాం..ఖబర్దార్…

* దోపిడీ చేసే వ్యవస్థకు, నాయకులకు ఒకటే చెప్తున్నాం..నేను మర్యాదగా కూర్చుని బాగున్నారా అని మాట్లాడే వ్యక్తిని కాదు, నేను మీలాగా కోట్లను జేబుల్లో నింపుకుని తియ్యటి మాటలు మాట్లాడడానికి రాలేదు. దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి జేబుల్లో, చేతుల్లో బాంబులు నింపుకుని వచ్చాము.

* నాకు మీలాగా భయం లేదు, మేము అవినీతి చెయ్యలేదు. ప్రధాని దగ్గర నుండి పంచాయితీ నాయకుడి దాకా బలంగా మిమల్ని ఎదుర్కోగలం.  

* యువతకు ఉద్యోగాలు ఇవ్వండి అంటే కూర్చోపెట్టి 1000 రూపాయలు పాకెట్ మనీ కింద ఇస్తాం అంటారు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పి వడ్డీలు, చక్ర వడ్డీలు వాళ్ళ చేతనే కట్టిస్తారు. 

* చినుకులు కురిస్తే చెరువులు నిండుతాయా? ముఖ్యమంత్రి గారు చేసే పనులు అలానే ఉంటాయి. కుంభవృష్టి కురిపించే అభివృద్ధి జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకు వస్తుంది.

* ఏ గ్రామానికి వెళ్లినా..ఏ నియోజకవర్గానికి వెళ్లినా…ఉదాహరణకు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో వున్నప్పుడు సెజ్ ను వ్యతిరేకించారు అంట, ఇప్పుడు మాట మార్చేశారు. నాలుక నాలుకా నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాకు దెబ్బలు పడతాయి అని వీపు అందట..అలాగే ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తెలుగుదేశానికి దెబ్బలు పడతాయి.   

* ముఖ్యమంత్రి గారు సహజంగానే ఆయన మావ అయినటువంటి ఎన్టీఆర్ గారిని దింపేసిన వ్యక్తి. ఇదంతా రాజకీయాల్లో సహజం అంటారు. సొంత మావనే దింపేసినోడు పవన్ కళ్యాణ్ ని ఎలా ఎదగనిస్తాడు అని నేను అనుకుంటాను. తెల్లని బట్టలు కట్టుకున్నామని మేము అమాయకంగా కనిపిస్తున్నామా? 

* తెలుగుదేశం పార్టీ నాకు ఎదో చేస్తుంది అని ఆశించలేదు, ప్రజలకు అండగా వుంటారని మద్దతు తెలిపాను. లోకేష్ గారికి తప్ప ఇంకెవరికీ ఉద్యోగాలు రాలేదు.

* తెలుగుదేశం పార్టీ ఉయ్యాలలా అవినీతితో ఊగి ఊగి మల్లి అవినీతి దగ్గరే ఆగిపోతుంది. తెలుగుదేశం వల్ల కొత్తదనం ఉండదు,

* తెలుగుదేశం వారు ఏమి చేసినా ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికే తీసుకొస్తారు. మళ్ళీ 2019లో తెలుగుదేశం నాయకులు మేమే అధికారంలో వచ్చేస్తాము అని అంటున్నారు. పూర్వం 90 సంవత్సరాలు గల ఒకరాజు గారి భార్య మళ్ళి మా భర్తే రాజు అవుతాడంటే రాజు గారి బామ్మర్ది మా అప్ప ఆరాటమే తప్ప మా బావ రాజు అవ్వడెహె అన్నాడంట. అలా ఉంది తెలుగుదేశం నాయకుల యవ్వారం. వాళ్ళు అధికారంలోకి వస్తామనే ఆర్భాటం తప్ప వాళ్ళు అధికారంలోకి రారు.   

* ప్రత్యేక హోదా మీద 2016లో నేను తిరుపతి, కాకినాడ, అనంతపురం లో మాట్లాడితే వాళ్ళు ప్యాకేజీ అంటారు. మనం ఏది మాట్లాడితే దానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఒక వ్యక్తిని వేరే వ్యక్తి గొడ్డలి ఎక్కడిది అంటే చెట్టు దగ్గర వున్నది అన్నాడంట, గొడ్డలి ఎక్కడ ఉన్నదంటే కొట్టే చెట్టు దగ్గర వున్నది అన్నాడంట..అలా వుంది ముఖ్యమంత్రి గారి పరిస్థితి. మనం ప్రత్యేక హోదా అంటే ఆయన ప్యాకేజీ అంటాడు. పోనీ ప్యాకేజీ ఏదంటే ఎదో మాట్లాడతారు. ఇలా తిప్పి తిప్పి మాట్లాడతారు తప్ప ముందుకు తీసుకువెళ్లరు.

* మన ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసిన జాతీయ పార్టీలకు పవన్ కళ్యాణ్ ఎలా మద్దతు తెలుపుతాడు? నేను కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని అన్నవాడిని, అమిత్ షా గారు వచ్చి జనసేన పార్టీని కలిపెయ్యమంటే నేను ఒప్పుకోలేదు. నేను భయపడడానికి జగన్ గారిలా అవినీతి చెయ్యలేదు. 

* ప్రత్యేక ప్యాకేజీ వద్దు అని నేను భారతీయ జనతా పార్టీని తిడితే ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు నేను భారతీయ జనతా పార్టీని వెనకేసుకొస్తున్నాను అంటున్నారు. నేను మోదీ దత్తపుత్రుడిని అంట..సొంత అన్ననే కాదనుకుని వచ్చి వాడిని నన్ను మోడీ దత్తపుత్రుడు అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు?

* లోకేష్ గారి అబ్బాయి మోదీ గారిని తాత అంటారంట..సంబంధాలు వాళ్ళు కొనసాగిస్తూ ముచ్చట్లు ఆడుకుంటున్నారు. మోదీ గారంటే నాకు ఏ భయం లేదు, ఒక ప్రధానికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవమే ఇస్తాను. మన ఆత్మగౌరవం దెబ్బ తింటే నేను మీలాగా రెండు చేతులతో గులాంగిరి చేసే వాడిని కాదు, ఆత్మాభిమానం కోసం గొంతు కోసుకునే వ్యక్తి నేను. 

* ఎవరి మీదో ఐటీ దాడులు జరిగితే ముఖ్యమంత్రి గారికి బాధ ఏంటి? ప్రతీ నియోజకవర్గానికి 25 – 40 కోట్లు దాచేసారంట, ఆ డబ్బు కనపడితే తీసేసుకోండి, అది మన డబ్బే!!

* అసలు మీ సమస్య ఏంటని ముఖ్యమంత్రి గారిని అడిగితే!!చెప్తే మానం పోతుంది, చెప్పకపోతే ప్రాణం పోతుంది అన్నట్టు ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఉంది. 

* ఇన్ని సమస్యలు వున్నా జగన మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లేదు. పిఠాపురం నుండి పోటీ చెయ్యమని నన్ను ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు. నాకు ఇక్కడ శ్రీ పాద వల్లభుడు తప్ప ఇంకేమి తెలియదు. ఆయనంటే నాకు అమితమైన ఇష్టం. ఆయన కోరుకుని ఆశీస్సులు ఇచ్చి, భగవంతుడు ఆదేశిస్తే పిఠాపురం నుండి పోటీ చేసే అవకాశం ఉంది. 

* పిఠాపురం మత్స్యకార గ్రామాలకు వెళ్తే అక్కడ అంతా సముద్ర కోతకి గురవుతుంటే వారి గురించి మాట్లేడేవారు ఎవరూ లేరు. వారికి అండగా ఉంటా అని నేను మాట ఇచ్చాను. 

* ఆడపడుచులే బాధ్యతగా సమాజాన్ని నడిపించగలరు. అందుకే వారికి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తాము. డ్వాక్రా మహిళలకు అండగా ఉండేందుకు మహిళలకు ప్రత్యేకంగా బ్యాంకు ను ఏర్పాటు చేస్తాం..

* తెలుగుదేశం మాదిరిగా డ్వాక్రా మహిళలను ఇబ్బంది పెట్టి మా కార్యక్రమాలకు తీసుకురాము. 

* యువతకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలి. 

* జగన్ మోహన్ గారి మీద దాడి ఎవరు చేసారో తెలియట్లేదు, ఇది చాలా విచిత్రమైన సంఘటన..దోషులు ఎవరో శ్రీపాద వల్లభుడికే తెలియాలి. 

* ఎవరో చిన్న కత్తితో జగన్ గారి మీద దాడి చేస్తే దానికి బదులుగా ఆ దాడి చేసిన వ్యక్తి జనసైనికుడు అని తెలుగుదేశం వారు చెప్పారు. తెలుగుదేశం వారు అంత నీచమైన రాజకీయాలకు దిగజారిపోయారు. 

* ఎవరో ఎవరితోనో రంకు చేస్తే దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి అంట. నేను ఒకవైపు ఆశయాలు గురించి మాట్లాడుతుంటే!!ఎవరో ఎవరితోనో పడుకుంటే పవన్ కళ్యాణ్ ని సమాధానం చెప్పమంటున్నారు. ఎవరో జగన్ గారి మీద దాడి చేస్తే దానికి జనసేన మీద నిందలు వేసేస్తారా? 

* ఒకప్పుడు జనసైనికులను గుర్తించనివారందరికీ ఈరోజున గుండెల్లో ముచ్చెమటలు పడుతున్నాయి. మార్పుకి సంకేతం జనసైనికులు, యువత..

* యువత బైక్ సౌండ్లను రైజ్ చేస్తుంది. అది మీ సరదా..కాని ఆ సరదా ఇతరులను బాధ పెట్టకూడదు. యువత క్షేమంగా ఉండాలి.

* యువత ఎవరూ కోపాన్ని ప్రదర్శించకండి. మనం రాజకీయంగా వున్నాము, మన మీద దాడులు చేసే అవకాశాలు వున్నాయి. నిజంగా మనం ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి వస్తే నేను మిమ్మల్ని పిలుస్తాను. అంత వరకు సమన్వయం పాటించండి.

* వంతాడలో బాక్సైట్ యజమానులు రాళ్ళ గుట్టలు వేసి మన బండ్లను ఆపేసారు. అయినా నేను వారితో గొడవ పెట్టుకోలేదు. నేను ఎవరితోనూ గొడవ పెట్టుకొను, నేను గొడవ పెట్టుకుంటే నేనో లేక వాడో ఒకడే ఉంటాడు.  

* నేను సహజంగా ఎవరినీ వాడు అని అనను. అలాంటిది ఆండ్రో సంస్థ యజమానిని అన్నాను. దానికి కారణం ఆ యజమాని అడవి తల్లిని ధ్వంసం చేస్తున్నాడు, గిరిజన భూములను లాక్కున్నాడు..నేను ఎంత సహనం పాటిస్తానో అంతకు అంత తెగించగలను.

* నేను లఫూట్ అనే ఒక్క పదమే అన్నాను. మన దగ్గర ఛానెల్స్ లేవుగా, అన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నాయి. బాలకృష్ణ గారు సంకరజాతి కొడుకులు అంటే డిబేట్లు జరగవు, తెలుగుదేశం నాయకులు మహిళను దూషిస్తే డిబేట్లు పెట్టలేదు, అలాంటిది అక్రమాలు చేసే వ్యక్తిని నేను లఫూట్ అంటే డిబేట్లు పెడుతున్నారు. 

* ఎప్పుడూ ఎవరు ఎవరితో పడుకున్నారని డిబేట్లు తప్ప పనికొచ్చేవి పెట్టరా? పిఠాపురంలో పోర్ట్ లేదు దాని గురించి న్యూస్ వెయ్యరా? సూరంపాలెంలో అక్రమాలు జరుగుతుంటే అది న్యూస్ కాదా? మీరు మమ్మల్ని భయపెడితే మేము భయపడతామనుకుంటున్నారా ? మేము ఓట్ల కోసం రాలేదు, బలమైన సామాజిక మార్పు కోసం వచ్చాము. 

* త్రికరణశుద్ధిగా నువ్వు ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షించి తీరుతుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. ధర్మో రక్షిత రక్షితః…నేను ధర్మాన్ని నమ్మినవాడిని. 

* నన్ను దెబ్బ కొట్టాలని ఆలోచించే ఏ ఒక్కరు కూడా నన్ను దెబ్బ కొట్టలేరు. శ్రీ పాద వల్లభుడిని గుండెల్లో పెట్టుకుని దేశ సేవకోసం ఏమీ ఆశించకుండా రాజకీయాల్లోకి వచ్చాను.

* పెద్ద కంపెనీలు వచ్చి నన్ను బ్రాండ్ అంబాసిడర్ గా ఉండండి, 10 కోట్లు ఇస్తాం అని చెప్పారు. కానీ నేను ఉండలేదు, చేనేత కార్మికుల కష్టాలు తెలుసు కాబట్టి వారికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను. 

* జనసేన పార్టీ చేనేత సోదరులకు, సోదరీమణులకు అండగా ఉంటుంది. ఎప్పుడూ కూడా నేను మీకు లేదు, కాదు అని చెప్పను.

* రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. నేను ఒక రైతును. ఆ కష్టాలు ఎలా వుంటాయో నాకు తెలుసు. అడ్డగోలుగా ఎవరైనా భూములు దోచుకుంటే మీకు అండగా మేము నిలబడతాము. 


Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.