• నెల్లూరు జిల్లా దువ్వూరులో జనసేన నాయకులపై దాడి అప్రజాస్వామికం
రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. అధికార వైసీపీ వాళ్ళకు ఇసుక ఆదాయ వనరుగా మారిపోయింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పెన్నా తీరంలో అడ్డగోలుగా తవ్వి దువ్వూరు మీదుగా తరలించేస్తున్నారు. భారీ వాహనాల్లో యధేచ్ఛగా సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణా వల్ల తమ గ్రామంలో రోడ్లు, చిన్న పాటి ఇళ్ళు దెబ్బతింటున్నాయని దువ్వూరు ప్రజలు ఆందోళనలో ఉన్నారు. వీరి తరఫున ఆ గ్రామం వెళ్ళి ఇసుక లారీలు అడ్డుకొన్న జనసేన నాయకులపై వైసీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఆత్మకూరు నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ శ్రీ నలిశెట్టి శ్రీధర్ తోపాటు పలువురికి గాయాలయ్యాయి . అప్రజాస్వామికమైన ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి . పోలీసు అధికారులు తక్షణమే దోషులను అరెస్టు చేయాలనీ, ఇసుక అక్రమ తవ్వకాలను నిలువరించాలనీ డిమాండ్ చేస్తున్నా మని శ్రీ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.