
- రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతున్న కూటమి ప్రభుత్వం: పొన్నాడ నాగేశ్వరరావు
పాలకొండ: పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలం, వండువ బౌండరీకి సంబంధించిన రీసర్వే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. వండువ, పాపమ్మపేట, బొడ్లపాడు ప్రాంతాలకు చెందిన రైతులు, కూటమి నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా కూటమి నాయకులు, సీనియర్ రాజకీయ నాయకుడు పొన్నాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ, భూ పాస్ పుస్తకాలు లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో పలుమార్లు అధికారులకు, నాయకులకు సమస్యను తెలియజేసినా పరిష్కారం కాలేదన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ చొరవతో వండువ బౌండరీలో రీసర్వే ప్రారంభమైందని తెలిపారు. సంబంధిత సర్వే నంబర్లకు చెందిన రైతులు తమ భూముల వద్దకు వచ్చి భూ కమతాలను అధికారులకు చూపించి రీసర్వే ప్రక్రియకు సహకరించాలని కోరారు.
రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అనే నమ్మకాన్ని కలిగించేలా ఎమ్మెల్యే జయకృష్ణ, స్థానిక నాయకులు పనిచేస్తారని నాగేశ్వరరావు అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్వేయర్ ఈశ్వర్ రావు, వండువ పంచాయతీ జనసేన నాయకులు గొర్లి కోటి, రఘు, మండల గణేష్, పొగిరి జగన్, జనసేన నాయకులు జానీ, వావిలపల్లి గోవింద, బోడసింగి వాసు తదితరులు పాల్గొన్నారు.