
• వైసీపీ ఆర్ధిక విధ్వంసం రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టింది
• అడుగడుగునా అప్పులు మిగిల్చారు.. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలనీ పక్కన పెట్టారు
• వాళ్ల అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ సంస్థలకు రూ. 1.29 లక్షల కోట్ల నష్టం
• కూటమి ప్రభుత్వంలో ప్రతి పైసా పారదర్శకంగా ప్రజా సంక్షేమానికి ఖర్చు
• కులాలను అడ్డుపెట్టుకుని కూటమి విచ్ఛిన్నానికి కుట్ర
• వైసీపీ కుట్రలను ఎదుర్కొనాలంటే మనం ఐక్యంగా ఉండాలి
• సుస్థిర అభివృద్ధి సాధించాలంటే 15 ఏళ్లు కూటమి అధికారంలో ఉండాలి
• ఈ బడ్జెట్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం
• కూటమి హయాంలో గ్రామీణాభివృద్దికి పెద్దపీట
• అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్
గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే… కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో కూడిన పాలన అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు ఆర్థిక విధ్వంసం సృష్టించి రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టివేశారని స్పష్టం చేశారు. వైసీపీ ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. మనకున్న పరిమిత వనరులను ఎంత సమర్థవంతంగా వినియోగించుకోవాలో ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే అర్థమవుతుందని, ఈ బడ్జెట్ ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చేలా ఉందని వ్యాఖ్యానించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూ.3.32లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని, బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, దక్షత, దార్శనికత అడుగడుగునా కనిపించిందని కొనియాడారు. శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “అభివృద్ధి.. సంక్షేమం.. పారదర్శకత.. జవాబుదారీతనం.. ప్రతి అడుగులో ఈ నాలుగు అంశాలే ఆలంబనగా గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గ దర్శనంలో, సుదీర్ఘ పరిపాలనా అనుభవం కలిగిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం త్వరలో రెండేళ్ల పాలన పూర్తి చేసుకోబోతోంది. ఈ రెండేళ్ల కాలంలో రెండు పూర్తిస్థాయి బడ్జెట్లు ప్రవేశపెట్టాం. గత ప్రభుత్వం రూ. 9.74 లక్షల కోట్ల అప్పులు చేసి సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు నిరంతరాయంగా కృషి చేస్తున్నాం. ఒక్క సామాజిక భద్రత పెన్షన్ల కోసమే రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.
• విద్యుత్ సంస్థలకు భారీ నష్టం
వైసీపీ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యుత్ సంస్థలు భారీగా నష్టపోయాయి. 2014-19 మధ్య చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను వైసీపీ నాయకులు ఇష్టానుసారం రద్దు చేయడం వల్ల డిస్కంలకు రూ. 12,250 కోట్ల నష్టం వచ్చింది. కరెంట్ సరఫరాలో కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఐదేళ్ల అసమర్ధ విధానాల కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.1.29 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఆ భారాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో మళ్లీ ప్రజల మీదనే మోపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధానాలను రద్దు చేసి ట్రూ అప్ ఛార్జీలు పూర్తిగా రద్దు చేసి, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ పేరిట ఛార్జీలు తగ్గించాం.
• రూ. 9.74 లక్షల కోట్ల మేర అప్పులు
గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థ పాలన, ఆర్థిక అరాచకం కారణంగా రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. రుజువులు లేకుండా రాజకీయ విమర్శలు చేయడం లేదు. ఆర్ధిక విధ్వంసం, ప్రకృతి విధ్వంసం, పర్యావరణ విధ్వంసం ఇలా ప్రతి అడుగులో మీరు చేసిన విధ్వంసం దాని వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయింది. ప్రజలకు ఎంత నష్టం జరిగింది. ప్రతి అంశం లెక్కలతో సహా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై జులై 2024లో విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉన్న వివరాల ప్రకారం వెళ్ళిపోయిన పాలకులు రూ. 9.74 లక్షల కోట్ల అప్పులు మా మీద వేసి వెళ్లారు. అందులో వివిధ శాఖల పరిధిలో పనులు చేయించుకుని కాంట్రాక్టర్లు, వెండర్లకు వాళ్ళు చెల్లించకుండా వదిలి వెళ్లిన అప్పులే 1.35 లక్షల కోట్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ. 25 వేల కోట్లు అప్పులు చెల్లించాం. నీటిపారుదల, రోడ్లు భవనాలు, పరిశ్రమలు ఇలా శాఖల వారీగా ప్రాజెక్టుల కోసం మరో రూ. 37 వేల కోట్లు విడుదల చేశాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు మిగిల్చిన అప్పులు తీరుస్తూ అదనంగా మేము కేంద్ర ప్రాయోజిత పథకాలకి 2025-26 ఆర్ధిక సంవత్సరంలోనే రూ. 18,700 కోట్లు విడుదల చేశాం.
• కేంద్ర నిధులు వినియోగించడంలో కూడా విఫలం
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.10,500 కోట్ల నిధులను వినియోగించుకోవడంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇందులో రూ.1,800 కోట్లు పీఎంఏవై అర్బన్, అర్బన్ రెజునివినేషన్ మిషన్, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఫర్ ఓబీసీ, ఈబీసీ, డీ నోటిఫైడ్ తెగలు, పీఎం యశస్వి కింద రావాల్సిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు చెల్లించకపోవడంతో వెనక్కి వెళ్లిపోయాయి. తద్వారా పట్టణాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. రాష్ట్ర విద్యార్ధులు, యువత నష్టపోయింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకి రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం కారణంగా రూ. 8,700 కోట్లు నిరుపయోగం అయిపోయాయి. ఫలితంగా కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు ఆగిపోయింది. గత ప్రభుత్వంలో పూర్తి చేయకుండా వదిలేసి వెళ్లిన పులివెందుల, డోన్, ఉద్దానం ప్రాజెక్టులకు రూ.400 కోట్లు కేటాయించి, మల్టీ విలేజ్ స్కీం ప్రాజెక్టులను ఈ వేసవిలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. మరో రూ. 7,910 కోట్లతో ఐదు జిల్లాల పరిధిలో మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను ప్రారంభించాం. 2027 చివరి నాటికి ఈ మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జల్ జీవన్ మిషన్ కు పునరుత్తేజం తెచ్చాం.
• విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు
విద్యా శాఖలో సహచర మంత్రివర్యులు, సోదరులు నారా లోకేష్ గారి నాయకత్వంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాం. తల్లికి వందనం, మెగా పేరెంట్ టీచర్స్ మీట్ వంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల మందికిపైగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాం. గత ప్రభుత్వం పేద విద్యార్ధులకి చదువుల నిమిత్తం ఇంటికి ఒక్కరి చొప్పున ఏడాదికి రూ. 15 వేలు ఆర్ధిక సాయం ఇవ్వగా మన ప్రభుత్వ ఇంట్లో ఎంత మంది చదువుకునే విద్యార్ధులు ఉంటే అంత మందికి రూ. 15,000 చొప్పున చెల్లిస్తుంది. తల్లికి వందనం పథకం ద్వారా ఏడాదికి 67 లక్షల మందికి రూ.10 వేల కోట్లకు పైగా లబ్ది చేకూరుతుంది.
• జల్ జీవన్ మిషన్ కు జీవం పోశాం
దేశంలో ప్రతి మనిషికి శుద్ధమైన, స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో తీసుకువచ్చిన జల్ జవన్ మిషన్ ను సైతం గత పాలకులు నిర్వీర్యం చేశారు. 2019-2024 మధ్య ఈ పథకం కింద కేంద్రం ప్రభుత్వం రూ. 27,000 కోట్లు కేటాయిస్తే, కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులో కేంద్రం ఇచ్చిన గ్రాంటే రూ. 2,000 కోట్లు ఉంది. మేము అధికారం చేపట్టిన తర్వాత గత ప్రభుత్వంలో పూర్తి చేయని పులివెందుల, డోన్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులను వేసవిలోపు పూర్తి చేయబోతున్నాం. రూ. 7,910 కోట్లతో ఐదు జిల్లాల పరిధిలో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన రూ. 9,500 కోట్ల నిధులతో రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న 3 వేల గ్రామాలను గుర్తించాం. వాటికి శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీరు అందించేలా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.
• ఐదేళ్లలో వాళ్లు ఖర్చు చేసింది రూ. 4610 కోట్లే
రాష్ట్రాభివృద్ధికి కీలకమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన ఖర్చు.. 20 నెలల్లో మన ప్రభుత్వం చేసిన ఖర్చు ఒకసారి చూసుకుంటే ఈ విషయం అర్థమవుతుంది. సీసీ, బీటీ రోడ్ల కోసం వైసీపీ సర్కార్ రూ. 641 కోట్లు ఖర్చు చేస్తే… కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలోనే రూ. 3853 కోట్లు ఖర్చు చేసింది. వైసీపీ నాయకులు తమ ఐదేళ్ల కాలంలో 854 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 239 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేస్తే… కూటమి ప్రభుత్వం 6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 1331 కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మించింది. గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఐదేళ్లలో వైసీపీ పెట్టిన మొత్తం ఖర్చు రూ. 4610 కోట్లు అయితే… కూటమి ప్రభుత్వం 20 నెలల్లో చేసిన ఖర్చు రూ. 11,506 కోట్లు. రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నామో ఈ లెక్కలే చెబుతాయి. ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ 2014-19లో 13.50 శాతం ఉంటే… వైసీపీ హయాంలో 10.05 శాతానికి పడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు మళ్లీ పుంజుకొని 11.75 శాతానికి చేరింది. మూలధన వ్యయం, మౌలిక వసతుల కల్పనకు వైసీపీ హయాంలో రూ. 16 వేల కోట్లు కేటాయిస్తే… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి బడ్జెట్ లోనే మూలధన వ్యయానికి రూ. 32,712.84 కోట్లు కేటాయించింది. ఇప్పుడు 2024-2025 ఆర్ధిక సంవత్సరానికి మరింత పెంచి రూ. 39,498 కోట్లు, తాజా బడ్జెట్ లో ఏకంగా 16 శాతం రూ. 53,915 కోట్లు కేటాయించాం.
• న్యాయవ్యవస్థకు ప్రాధాన్యత పెంచుతున్నాం
దేశంలోని 140 కోట్ల ప్రజల భవిష్యత్తును నిర్ణయించే విధంగా భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగ నిర్మాతలు శాసన, కార్యనిర్వహక, న్యాయ అనే మూడు కీలక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ మూడు ప్రధాన వ్యవస్థలు పరస్పర సమన్వయంతో, ఎటువంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలంగా నిలబడుతుంది. వీటిలో ఏ ఒక్క వ్యవస్థలోనైనా లోపాలు ఏర్పడితే, అది ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపడమే కాకుండా ప్రజలకు న్యాయం, సేవలు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇటీవల గౌరవ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారిని కలవడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన నాకు చెప్పింది ఏంటంటే.. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ లెక్కల ప్రకారం దాదాపు దేశ వ్యాప్తంగా 1,11,59,767 సివిల్ కేసులు, 3,80,60,784 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని ఎలా తగ్గించగలం అనే అంశాన్ని సభ దృష్టిలో పెట్టండి అని చెప్పారు. మన దేశంలో ఉన్న కోర్టుల సంఖ్యకు, అక్కడి మౌలిక సదుపాయాలకు, రోజువారీగా నమోదు అవుతున్న కేసుల సంఖ్యకు మధ్య స్పష్టమైన అసమతుల్యత ఉంది. ఈ పరిస్థితిలో ఈ కేసులన్నీ పరిష్కారం కావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో కూడా చెప్పడం కష్టం. ప్రస్తుతం దేశంలో చాలా కోర్టుల పరిస్థితిని పరిశీలిస్తే, కనీస మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళా న్యాయవాదుల కోసం టాయిలెట్ సదుపాయాలు కూడా చాలా చోట్ల లేవు. కనీసం విశ్రాంతి గదులు కూడా లేవు. రోజూ వేలాది మంది కోర్టులకు వచ్చి వెళ్తుంటారు. వారికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం చాలా అవసరం. అందుకే బడ్జెట్లో న్యాయశాఖకు తగిన నిధులను కేటాయించే బాధ్యత లెజిస్లేటివ్ వ్యవస్థ మీద ఉందని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంలో ఈ సంవత్సరం ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాదాపు 100 కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి రూ.349 కోట్లను కేటాయించడం మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. గతంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం న్యాయశాఖకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, సభ దృష్టికి నేను తీసుకొచ్చేది ఏంటంటే ఇంకా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఒకరి మీద కేసు ఉంటే ఆ కుటుంబం మీద ప్రభావం పడుతుంది. ఒక కోటి కేసులు ఉంటే… దాని ప్రభావం 10 కోట్ల మందిపై ఉంటుందని గవర్నర్ గారు చెప్పారు. కేసుల క్లిష్టతను బట్టి ఏడీఆర్ సెంటర్ల ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటే కోర్టుల మీద భారం తగ్గుతుందని చెప్పారు. కొత్త కోర్టు భవనాల నిర్మాణం మాత్రమే కాకుండా, ఇప్పటికే ఉన్న కోర్టులన్నిటిలో కూడా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం అత్యంత అవసరం. ముఖ్యంగా టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు, కంప్యూటర్లు, సర్వర్లు, నెట్వర్కింగ్ వ్యవస్థలు, డిజిటల్ రికార్డ్ మేనేజ్మెంట్ వంటి ఐటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. అలాగే కోర్టులు, జైళ్ల మధ్య వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థలను విస్తరించడం, ఆటోమేటెడ్ కేసు నిర్వహణ వ్యవస్థలను అమలు చేయడం వంటి సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడం ద్వారా విచారణ వేగాన్ని పెంచి ఖర్చులను కూడా తగ్గించవచ్చు. ఈ అంశంపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సమగ్ర చర్చ జరపాలని, అవసరమైతే గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారి విలువైన సూచనలను తీసుకుని ముందుకు సాగితే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఈ సభ దృష్టికి తీసుకువస్తున్నాను.
• కల్తీ వాళ్లు చేసి … నిందలు కూటమి మీద వేశారు
11మంది సభ్యులుంటే 11వందల మంది ఉన్నట్లుగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్లు చెప్పే అసత్యాలు కూడా ప్రజలు నిజాలని నమ్మే ప్రమాదం ఉంది. ఇతరుల స్వేచ్ఛను, హక్కులను హరించటం తమ హక్కని వాళ్లు భావిస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్ 21ను వైసీపీ సభ్యులు సరైన విధంగా అర్థం చేసుకోవడం లేదు. అలాగే ఆర్టికల్ 19(1)(a) ప్రకారం మాట్లాడే స్వేచ్ఛను ఇతరులను దూషించేందుకు ఉపయోగిస్తున్నారు. “ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే” అని హిందీలో అంటారు. తెలుగులో చెప్పాలంటే దొంగే దొంగ దొంగ అని పోలీసుల మీద అరవడం. వైసీపీ నాయకుల తీరు అలానే ఉంది. పవిత్రమైన తిరుమల లడ్డూలో వాడే నెయ్యిని వాళ్లే కల్తీ చేసి… నిందలు మాత్రం కూటమి ప్రభుత్వంపై మోపుతారు.
* తిట్టి కులం వెనక దాక్కొంటున్నారు
ఎవరు ఎమ్మెల్యేగా గెలవాలన్నా.. అన్ని కులాల వాళ్లు ఓట్లు వేయాల్సిందే. ఈ మధ్య కొందరు ఇష్టం వచ్చినట్లుగా తిట్టి కులం వెనుక దాక్కుంటున్నారు. ఇష్టం వచ్చినట్లుగా తిట్టి కులం వెనుక దాక్కుంటే రాష్ట్రం నష్టపోతుంది. కులం దాటకపోతే రాష్ట్రం విచ్చిన్నమవుతుంది. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా మనమే చెప్పాలి. లేకపోతే ఎంత బడ్జెట్ పెట్టినా ఉపయోగం ఉండదు.
• ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం
రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి నేతలందరం ఐక్యంగా ముందుకెళ్దాం. కూటమి చాలా బలంగా ఉండాలనేది నా ఆకాంక్ష. రాష్ట్ర అభివృద్ధి కోసమే 2014లో ఎటువంటి పదవులు ఆశించకుండా కూటమి కోసం కష్టపడ్డాను. 2019లో అది సాధ్యం కాలేదు. 2024లో నన్ను నేను తగ్గించుకొని కూటమి ఏర్పాటుకు సహకరించాను. ప్రజల ఆకాంక్షలు, ఆశలు ముందుకు తీసుకెళ్లాలంటే మనలో ఏదైనా చిన్నచిన్న సమస్యలున్నా సర్దుకోవాలి. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉండాల’న్నారు.