

* ఎనిమిది ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి
* వీటిలో నాలుగు త్వరలో ప్రారంభం
* మరో నాలుగు చేపల రేవులకు మహర్దశ
* కూటమి ప్రభుత్వం చొరవ
* ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ
ఎన్నికల ప్రచార సమయంలోనే… ‘‘నేను మత్స్యకారుల పక్షపాతిగా ఉంటాను’’ అని జనసేన అధినేతగా శ్రీ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అందుకు తగినట్టుగానే ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో జాలర్ల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. ఆయన శ్రద్ధకు కూటమి ప్రభుత్వం చొరవ కూడా తోడవడంతో రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లకు మహర్దశ పట్టనుంది.
* సువిశాల సముద్ర తీరం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు 974 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ వనరును సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపల రేవులు (Fishing Harbours), ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. రెండు దశల్లో కొత్త చేపల రేవులను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వివిధ పనులకు శ్రీకారం చుట్టింది.
ముఖ్యమైన ప్రాంతాలైన ఉప్పాడ (కాకినాడ), మచిలీపట్నం (కృష్ణా), నిజాంపట్నం (బాపట్ల), జువ్వలదిన్నె (నెల్లూరు), పూడిమడక (అనకాపల్లి), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి) ప్రాంతాల్లో ఆధునికీకరణ పనులు చేపట్టింది. పాత రేవుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ప్రధాన లక్ష్యం.
* ఇవీ ముఖ్య ప్రయోజనాలు…
చేపల రేవులను మెరుగుపరచడం ద్వారా ముఖ్యంగా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. సముద్రంలోకి వెళ్లి వేట ముగించుకుని వచ్చిన తర్వాత చేపలను భద్రపరుచుకోవడానికి, విక్రయించుకోవడానికి ఆధునిక వసతులు లభిస్తాయి. దీనివల్ల దళారుల బెడద తగ్గి మత్స్యకారులకు మెరుగైన ధర లభిస్తుంది. స్థానికంగానే ఆధునిక హార్బర్లు అందుబాటులోకి రావడం వల్ల, ఉపాధి కోసం మత్స్యకారులు గుజరాత్, చెన్నై లేదా ఒడిశా వంటి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్యాకింగ్, ప్రాసెసింగ్ యూనిట్ల వల్ల ఆంధ్రా చేపలు, రొయ్యల ఎగుమతులు పెరుగుతాయి. తద్వారా విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది.
ఫిషింగ్ హార్బర్ల ఆధునికీకరణ వల్ల అనుబంధ పరిశ్రమల స్థాపన వీలవుతుంది. హార్బర్ల వద్ద ఐస్ ప్లాంట్లు, నెట్ రిపేరింగ్ షెడ్లు, డీజిల్ బంకులు, రవాణా సౌకర్యాలు మెరుగుపడటం వల్ల వేలాది మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది.
ముఖ్యంగా తుపానులు లేదా అలల ఉధృతి సమయంలో మత్స్యకారుల పడవలు సురక్షితంగా ఉండటానికి ఈ హార్బర్లు రక్షణ కవచంలా పనిచేస్తాయి.
మత్స్య సంపద ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం మౌలిక సదుపాయాలు, జెట్టీలు, కోల్డ్ స్టోరేజీలు, క్వే (Quay) వసతులు ఏర్పడతాయి.
ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగవడం వల్ల తీరప్రాంత పర్యాటక రంగం కూడా వృద్ధి చెందుతుంది.
* కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగం…
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సాస్కి అనే పథకం ఉంది. ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్’ కి సంక్షిప్త రూపమైన ఈ ‘సాస్కి’ పథకంతో పాటు, ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ అనే మరో పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటోంది.
* రూ.3,091 కోట్లతో 8 చేపల రేవులు…
రాష్ట్రంలో మొదటి దశలో నిర్మాణంలో ఉన్న నాలుగు చేపల రేవులను పూర్తిచేసి ఈ ఏడాదిలో వాటిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.1,522.80 కోట్లతో వాటి నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. వీటిలో 85 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రూ.440.91 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన పనులూ పూర్తవుతాయి. వాటిని వేగంగా పూర్తిచేసి చేపల వేటకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలనేదే ప్రభుత్వం లక్ష్యం.
ఇక రెండో దశలో మరో నాలుగు చోట్ల కొత్త రేవుల నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ ఎనిమిది చేపల రేవులను రూ.3,091.14 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. కొత్త చేపల రేవులు అందుబాటులోకి వస్తే.. మరో లక్ష టన్నుల సముద్ర చేపల ఉత్పత్తులు అదనంగా వచ్చే అవకాశం ఉందని అంచనా.
* కొత్త రేవులతో సదుపాయాలు…
కొత్తగా నిర్మించే చేపల రేవుల్లో శీతల గిడ్డంగులు, ఐస్ ప్లాంట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఆక్షన్ హాళ్లు, డ్రై ఫిషింగ్ ప్లాట్‌ఫారాలను ఏర్పాటు చేస్తారు. రూ.3 వేల కోట్ల పెట్టుబడులను మౌలిక సదుపాయాల కోసం వెచ్చిస్తున్నారు.
* రెండో దశలో రూ.1,585 కోట్లతో…
రెండో దశలో నాలుగు చేపల రేవులతో పాటు బియ్యపుతిప్ప దగ్గర ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా అంచనాలు సిద్ధం చేసింది. గతంలో రూపొందించిన అంచనాలను సవరించి రూ.1,585 కోట్లతో పనులు చేపడతారు. కొత్తగా నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ల కోసం కేంద్రం సాస్కి కింద రూ.410 కోట్లతో పాటు గ్రాంటు కింద మరో రూ.240 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.40 కోట్లు వెచ్చించనుంది.
పూడిమడక ఫిషింగ్ హార్బర్లో 3,000 టన్నుల డెడ్ వెయిట్ టన్నేజ్ (డీడబ్ల్యూటీ) సామర్థ్యంతో కోస్టల్ బెర్త్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రతిపాదన సవరించారు. దీనివల్ల గతంలో రూ.392.53 కోట్లకు బదులు.. రూ.700 కోట్లకు అంచనాలు పెరిగాయి.
పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్పలో చేపల రేవుకు బదులు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు వీలుగా మత్స్యశాఖ అంచనాలు తయారు చేస్తోంది.
జువ్వలదిన్నె (నెల్లూరు)లో పనులు ఇప్పటికే పూర్తి కావొచ్చాయి. దీనికి కేంద్రం ‘బ్లూ రివల్యూషన్’ పథకం కింద ₹138.29 కోట్ల సహాయం అందించింది.
మొదటి దశలో చేపట్టిన నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి మరిన్ని నిధులను (సుమారు ₹440 కోట్లు) ఆశిస్తోంది.
కొత్తపట్నం (బాపట్ల), పూడిమడక (అనకాపల్లి), బుడగట్లపాలెం (శ్రీకాకుళం) రేవుల పనులను PMMSY పథకం కింద సుమారు ₹1,137 కోట్ల వ్యయంతో చేపట్టారు.
మొత్తం మీద ఈ పథకాల వల్ల చేపల రేవులతో పాటు భీమిలి, రాజయ్యపేట, చింతపల్లి వంటి ప్రాంతాల్లో షిఫ్ ల్యాండింగ్ సెంటర్లు రానున్నాయి. వేటాడిన చేపలు పాడవకుండా ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు అవుతాయి.
* ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ…
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖల బాధ్యుడిగా శ్రీ పవన్ కళ్యాణ్, మత్స్యకారుల సంక్షేమానికి, వారి జీవనోపాధి మెరుగుపరచడానికి ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, వారి భద్రతకు సంబంధించి ఆయన తీసుకుంటున్న చొరవ ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడానికి, తిరిగి రావడానికి పడే ఇబ్బందులను గమనించి, తీరప్రాంత జిల్లాల్లో మరిన్ని ఫ్లోటింగ్ జెట్టీలు (Floating Jetties), ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల చిన్నకారు మత్స్యకారులకు రవాణా ఖర్చులు తగ్గుతాయి.
తీరప్రాంతాల్లో పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాల వల్ల మత్స్య సంపద తగ్గిపోతుండటంపై శ్రీ పవన్ కళ్యాణ్ గతంలోనే ‘మత్స్యకార అభ్యుదయ యాత్ర’ ద్వారా గళమెత్తారు. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామిగా సముద్ర కాలుష్యాన్ని తగ్గించి, చేపల పునరుత్పత్తికి ఆటంకం కలగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచిస్తున్నారు.
అలాగే మత్స్యకారుల వేటపై ఆధారపడే కుటుంబాలకు అదనపు ఆదాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు.
చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే పరిహారం (మత్స్యకార భరోసా) లబ్ధిదారులకు సకాలంలో అందేలా పర్యవేక్షిస్తున్నారు.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా, తీరప్రాంత గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తాగునీటి సౌకర్యం మరియు వీధి దీపాల ఏర్పాటుపై ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు. మత్స్యకార వాడల్లో జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయి.