గోదావరి కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం

రాజమహేంద్రవరం : గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల గోదావరి పరివాహక ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి సేకరించిన నీటి నమూనాలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో ఆందోళనకర విషయాలు వెలుగులోకి రావడంతో సోమవారం అత్యవసర సమీక్ష నిర్వహించారు.

గోదావరి నదిలో అనుమతించదగిన పరిమితుల కంటే అధిక స్థాయిలో కాలుష్య కారకాలు ఉన్నట్లు ల్యాబ్ నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్, నల్లా ఛానల్ పరిసరాల్లో కోలిఫామ్ బ్యాక్టీరియా, నైట్రేట్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) ప్రమాదకర స్థాయిలో నమోదయ్యాయి. దీంతో ఈ నీరు స్నానాలకు, గృహ అవసరాలకు అనువుకాదని నివేదిక స్పష్టం చేసింది.

ఆంధ్ర పేపర్ మిల్లు లగూన్ల వద్ద సేకరించిన నమూనాల్లో కూడా ఫాస్ఫేట్లు, సల్ఫైడ్లు, BOD స్థాయిలు పరిమితిని మించి ఉన్నట్లు తేలింది. పరిశ్రమ వ్యర్థాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేయకపోవడం వల్ల గోదావరి జలాలు ప్రభావితమవుతున్నాయని అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “కళ్ల ముందే గోదావరి కలుషితమవుతుంటే అధికారులు ఇన్ని రోజులుగా ఏం చేశారు?” అంటూ ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై గతంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను నిలదీశారు.

కాలుష్యానికి కారణమైన ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజమహేంద్రవరం పీసీబీ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అయితే పరిశ్రమ మూసివేత వల్ల కార్మికుల ఉపాధిపై ప్రభావం పడకుండా మానవతా దృక్పథంతో మరో అవకాశం ఇస్తున్నామని, వెంటనే వ్యర్థజల శుద్ధి వ్యవస్థను మెరుగుపరచాలని ఆంధ్ర పేపర్ మిల్లు యాజమాన్యాన్ని ఆదేశించారు.

రాజమహేంద్రవరం నగరంలోని మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం జలశక్తి శాఖ మంత్రితో చర్చిస్తానని తెలిపారు.

సమావేశంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి. కృష్ణయ్య, మెంబర్ సెక్రటరీ ఎస్. శరవణన్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.