తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మంత్రివర్గ సహచరులకు శుభాభినందనలు. శ్రీ రేవంత్ రెడ్డి గారితో నాకు వ్యక్తిగతంగా స్నేహం ఉంది. తెలంగాణలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని తమ పార్టీ అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించారు. వాగ్ధాటి, ప్రజాకర్షణ కలిగిన ఆయన రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర ్కొంటూ పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. తెలంగాణలో జరిగిన ఉద్యమాలు, వాటి నేపథ్యాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు. నీళ్ళు, నిధులు, నియామకాలు.. ప్రధాన అంశాలుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర సాధన కోసం అమరులైన యువత.. ఏ ఆశయాల కోసం ఆత్మ బలిదానాలు చేసిందో వాటిని సంపూర్ణంగా నెరవేర్చి ఆ త్యాగాలకు గౌరవాన్ని , సార్థకతను కల్పించాలి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం… అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నానని జనసేనాని పేర్కొన్నారు.