టీడీపీ, బీజేపీ కుమ్ములాటలో రాష్ట్రం నష్టపోతోంది – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…

రాష్ట్రంలో అవినీతిమయమైన, అధర్మమైన పాలన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జనసేన ఎందుకు అండగా నిలుస్తుంది..? మా పార్టీ ఎప్పుడూ ధర్మం వైపే నిలబడుతుంది అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.

2019లోనూ మీరే రావాలి అంటూ చంద్రబాబు కోసం హోర్డింగులు పెడుతున్నారు… ఎందుకు రావాలి.. మరింత అవినీతి చేసేందుకా అని నిలదీశారు. జిల్లేడు చెట్టుకు పారిజాతాలు ఎలా పూయవో టీడీపీ పాలనలో నీతి అనేది ఉండదు అన్నారు. 2019లో టీడీపీ కాదు జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అని చెప్పారు. ఆదివారం రాత్రి జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో జనసేన పోరాటయాత్ర సభను నిర్వహించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరై శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నీరాజనాలు పలికారు. ఈ వేదిక నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్, బిజెపీలు కలిసే అన్యాయం చేశాయి. 1997లో కాకినాడలోనే బిజెపీవాళ్లు ఒక ఓటు, రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేశారు. ఆరోజే మన నాయకులు సిగ్గుపడాల్సింది. మా రాష్ట్రాన్ని విడదీయడానికి మీరు ఎవరు అని నిలదీయలేదు. నాకు బీజేపీ అంటే చాలా కోపం, విసుగు ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో రెండు జాతీయ పార్టీలు కలిసే పని చేశాయి. 2014 ఎన్నికల ముందు గాంధీనగర్ లో మోడీ గారిని కలిసి జరిగిన అన్యాయం వివరించి ప్రధాని అయ్యాక సరి చేయాలని కోరాను. చేయకపోతే యువతలో నిస్పృహ పెరిగి, వేర్పాటువాదాలు వస్తాయని చెప్పాను. మోడీ గారు చేస్తారని నమ్మాను, చేయలేదు. దుక్కి దున్నే ఎడ్లు కొట్టుకొంటే దూడ కాళ్ళు విరిగాయని ఓ సామెత ఉంది. అలా టీడీపీ, బీజేపీ కుమ్ములాటలో రాష్ట్రం నష్టపోతోంది. విభజన చర్చల్లో టీడీపీ ఎంపీలు కొనకళ్ళ నారాయణ గారిని, శివప్రసాద్ గారిని రక్తాలు వచ్చేలా ఉత్తరాది కాంగ్రెస్ ఎంపీలు కొట్టారు. వారిని కొట్టారని తెలియగానే నాకే కోపం వచ్చింది. టీడీపీకి పౌరుషం లేదా? కోపం రాదా? వాళ్ళని చితక్కొట్టిన కాంగ్రెస్ తోనే వెళ్ళి పొత్తు పెట్టుకొంటున్నారు. రాష్ట్ర విభజన కాలంలో వై.ఎస్.జగన్ గారు కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల గళం వినిపించలేదు. ఆ సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను హైదరబాద్ లో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారు. చాలా అవమానపడ్డారు. వీరి గురించి జగన్ మాట్లాడలేదు. కెసిఆర్, గద్దర్, ఇతర ప్రజా సంఘాల నాయకులతో నేను చెప్పాను… ఆంధ్ర పాలకులు వేరు, ఆంధ్ర ప్రజలు వేరు. ఆంధ్ర పాలకుల తప్పులకు ప్రజలను అనొద్దు అన్నాను.  జగన్ ఆ మాత్రం కూడా చెప్పలేదు. 

తమ ఎంపీలను కొట్టిన కాంగ్రెస్ తో టీడీపీ కలిసినా, ఆంధ్ర ప్రజలు అవమానపడుతుంటే మాట్లాడని జగన్ కు ఏం అర్హత ఉంటుంది? ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడలేని వాళ్ళు ఏపీ సీఎం కాలేరు.. కారాదు. ఇది శాసనం. మన రాష్ట్రాన్ని విడగొట్టినవాళ్లపై ఎంతో కోపం వుంది. వాళ్ళ ఉత్తరప్రదేశ్ కూడా నాలుగు ముక్కలు కావాలి. అంత పెద్ద రాష్ట్రాన్ని చూసుకొనే విర్రవీగుతున్నారు. అది నాలుగు ముక్కలైతే ఆ జాతీయ పార్టీలకు తెలుస్తుంది. ఇది ఆంధ్రుల శాపం.

రూ.3 వేల కోట్లు దోచేశారు

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ఎప్పుడూ ముఖ్యమంత్రి కలిసిరాలేదు. తిరుపతి, కాకినాడ సభల్లో హోదాపై నేను గట్టిగా మాట్లాడాను. అప్పుడు కూడా ముఖ్యమంత్రి పిలిచి కలిసి పోరాడదాం అనలేదు. ప్యాకేజీ ప్రకటించగానే బిజెపివాళ్ళకి మంగళ స్నానాలు చేయించి, సుగంధాలు పూసి సత్కారాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ హోదా అంటూ దీక్షలు చేస్తున్నారు. ఆయనకు, జగన్ కు మోడీ అంటే భయం. నిలదీసి మాట్లాడలేరు. మోడీ అంటే నాకేం భయం. ఆయన నాకు ఏమైనా అన్నగారా? సొంత అన్నయ్యనే ఎదిరించి వచ్చినవాణ్ణి. 

పరిశ్రమలపై ఐటీ దాడులు చేస్తే ముఖ్యమంత్రి భయపడుతున్నారు. పారిశ్రామికవేత్తలు భయపడాల్సిందిపోయి సీఎం ఎందుకు భయపడుతున్నారు. చెప్పుకోలేని రహస్యాలు ఏమైనా ఉన్నాయా? సచివాలయం మీదో, చీఫ్ సెక్రెటరీ, డీజీపీ ఆఫీసుల మీదో కేంద్ర సంస్థలు దాడులు చేస్తే రాష్ట్ర గౌరవాన్ని కాపాడేందుకు జనసేన మీకు అండగా నిలుస్తుంది. అంతే తప్ప అధర్మ పాలన చేసే చంద్రబాబుకి కాదు. వంతాడలో అడ్డగోలుగా లాటరైట్ ఖనిజాన్ని తవ్వేస్తున్నారు. రూ.3 వేల కోట్లు విలువైన ఖనిజాన్ని అక్రమంగా తరలించి రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారు. అయినా ముఖ్యమంత్రి పట్టించుకోరు. ఆండ్రూ కంపెనీ వాడు… అక్కడ అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్తుంటే అడ్డంకులు కల్పించి మట్టి పోసాడు. వాడికి చెబుతున్నా… అవినీతి చేసే మీ తోలు తీసి కాళ్ళు విరగ్గొట్టకపోతే నా పేరు కళ్యాణ్ కాదు. కాంగ్రెస్ పాలనలో అక్రమంగా 100 లారీలు తవ్వితే టీడీపీ పాలనలో 200 లారీలు తవ్వేస్తున్నారు. చంద్రబాబు రియల్ టైమ్ గవర్నెన్స్ లో ఈ అవినీతి కనిపించడం లేదా? 

బాబు ఇక రిటైర్ కావాలి 

ప్రజలు బలమైన మార్పు కోరుకొంటున్నారు. ఇక చంద్రబాబు నాయుడు రిటైర్ కావలసిన సమయం వచ్చింది. రిటైర్ చేయించేద్దాం. బాధ్యత, చిత్తశుద్ధి కలిగిన నవతరాన్ని అధికారంలోకి తీసుకువద్దాం. జనసేనకు అన్ని కులాలూ సమానమే. సంపద, అభివృద్ధి ఏ కొందరి సొంతమో కాదు. అందరికీ సమానంగా అవి దక్కేలా జనసేన చేస్తుంది. లక్ష మంది ఉద్యోగార్తులు ఉంటే లక్షన్నర ఉద్యోగాలు సృష్టించాలి. ఆ దిశగా అభివృద్ధి చేస్తాం” అన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.