ప్రభుత్వ శాఖల్లో నామమాత్రపు వేతనంతో పని చేస్తున్న చిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పార్టీ దృష్టికి వస్తున్నాయని, వాటికి పరిష్కారం ఇస్తూ ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ చేర్చడంపై అధ్యయనం చేయాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్ట్ రిక్రూట్మెం ట్ వి.ఆర్.ఏ. అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి అందచేశారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో జరిగిన సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార వ్యూహాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా వి.ఆర్.ఏలు, వెటర్నరీ అసిస్టెంట్స్ తదితర చిరుద్యోగుల సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో దాదాపుగా 19359 మంది వి.ఆర్.ఏ.లు ఉన్నారనీ, వారికి నామ మాత్రపు వేతనమే ఇస్తున్నారని, వారికి గత ప్రభుత్వం డి.ఏ.ను రూ.100 నుంచి రూ.300కి పెంచితే వైసీపీ ప్రభుత్వం డీఏ మొత్తాన్ని వెనక్కి తీసుకొందని తెలిపారు. వెటర్నరీ అసిస్టెంట్స్ సైతం సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ, సంక్షేమ శాఖల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు ఇటీవల చేసిన ఆందోళనల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే చిన్న పాటి ఉద్యోగులను వైసీపీ ఇబ్బందిపెడుతోందని, వారికి తగిన భరోసా కల్పించే బాధ్యతను రాబోయే ఉమ్మడి ప్రభుత్వం తీసుకొంటుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. వి.ఆర్.ఏ.ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించాలని నాయకులకు, మేనిఫెస్టో కమిటీ సభ్యులకు సూచించారు.